
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో దేశంలో ఇప్పటికే గ్యాస్, ఇంధన, వంటనూనె ధరలు పెరగ్గా.. తాజాగా మరో షాక్ కూడా తగలింది. అంతర్జాతీయ ఉద్రిత్త పరిస్థితుల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దీని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతోంది. తాజాగా మరో నిత్యావసర వస్తువు ధర పెరిగింది. అదే ప్లాస్టిక్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ బాటిళ్లకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలో వాటర్ బాటిళ్ల ధరలను 8 శాతం నుంచి 11 శాతం వరకు కంపెనీలు పెంచాయి. బిస్లరీతో పాటు మిగతా కంపెనీలన్నీ ధరలను గణనీయంగా పెంచేశాయి.
ప్రస్తుతం 12 బాటిళ్లు ఉంటే బిస్లరీ 1 లీటర్ ప్యాక్ ధర రూ.216 నుంచి రూ.240కి పెరిగింది. ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, ఖర్చులు పెరగడం వల్ల పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది. ప్లాస్లిట్ బాటర్ బాటిల్ కోసం ఉపయోగించే పాలిమర్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ నుంచి పాలిమార్ తయారుచేస్తారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాలిమార్ ధరలు కూడా పెరగడంతో వాటర్ బాటిల్ కంపెనీలపై భారం పెరిగింది. ఇక మూతలు, కార్టన్ పెట్టెలు, లేబుళ్లు, టేప్ వంటి ఇతర ధరలు కూడా పెరిగాయి. ప్లాస్టిక్ పదార్థాల ధర 50 శాతం పెరగడంతో కిలోగ్రాముకు రూ.170కి చేరుకుంది. ఇక మూతల ధర రెండింతలు పెరిగింది. దీని వల్ల వాటర్ బాటిల్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరగడంతో ధరలను పెంచేశారు.
సెప్టెంబర్‌లో వాటర్ బాటిళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో వీటి ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ ఖరీదుగా మారాయి. పార్లే ఆగ్రో, క్లియర్ వంటి ప్రీమియం బ్రాండ్ల వాటర్ బాటిల్ ధరలు కూడా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. ఇండియాలో మంచి నీరు దొరకడం అనేది కష్టంగా మారింది. భూగర్భ జలాలు 70 శాతం కలుషితమయ్యాయి. దీంతో 140 కోట్ల జనాభాకు తాగునీరు అందించడం అనేది కష్టంతో కూడుకున్న పని. దీంతో వాటర్ బాటిళ్లపై చాలామంది ఆధారపడుతున్నారు. పెరుగుతున్న ముడి పదార్థాల ధరల వల్ల వాటర్ బాటిళ్ల పరిశ్రమ మొత్తం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. యుద్దం పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇదే జరిగే సామాన్యులకు పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. అసలే ఎండాకాలం కావడంతో వీటిపై ఎక్కువమంది ఆధారపడతారు. బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.