Online Scam: ఫ్లిప్‌కార్ట్‌లో చీర రిటర్న్ చేయబోయి భారీ మోసం.. రూ.674 చీర కోసం ప్రయత్నిస్తే ఖాతాలోని రూ.99,518 మాయం!
Online Scam: కుటుంబం ఆమె పెళ్లి ఖర్చుల కోసం ఇంట్లో సబ్‌మెర్సిబుల్ వాటర్ పంపు ఏర్పాటు చేసుకోవడం కోసం కష్టపడి డబ్బులు దాచుకుంది. ఆ మొత్తమే సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డబ్బులు పోయిన విషయం..

Online Scam: ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని భారీగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన చీరను తిరిగి ఇచ్చి డబ్బులు పొందాలనుకున్న ఆమె.. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.99,518 కోల్పోయింది. అసలు ఏం జరిగిందంటే?
రూ.674 చీర కొనుగోలు.. రీఫండ్ కోసం ఎదురుచూపులు:
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఆకాంక్ష అనే మహిళ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 విలువైన చీరను కొనుగోలు చేసింది. అయితే ఆ చీర ఆమెకు నచ్చకపోవడంతో తిరిగి ఇచ్చి డబ్బులు పొందాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఏడు రోజులు గడిచినా ఆమె ఖాతాలో రీఫండ్ డబ్బులు జమ కాలేదు. దీంతో ఆర్డర్‌కు సంబంధించిన నంబర్‌కు ఫోన్ చేసి తన డబ్బుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఇదే ఆమెకు పెద్ద సమస్యగా మారింది.
స్క్రీన్ షేర్ చేయించుకుని.. ఖాతా ఖాళీ!
రీఫండ్ ఇప్పిస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. డబ్బులు తిరిగి రావాలంటే మొబైల్ స్క్రీన్‌ను షేర్ చేయాలని, ఫోన్‌కు వచ్చిన గిఫ్ట్ కార్డు కూపన్‌ను ఓపెన్ చేయాలని సూచించారు. వారి మాటలు నమ్మిన ఆకాంక్ష అలా చేయడంతో నేరగాళ్లు ఆమె మొబైల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఐదు విడతల్లో డబ్బులు మాయమయ్యాయి. మొదటిసారి రూ.10,000, రెండోసారి రూ.10,000, మూడోసారి రూ.19,999, నాలుగోసారి రూ.55,000, ఐదోసారి రూ.4,495 చొప్పున డబ్బులు కట్ అయ్యాయి.
మొత్తంగా రూ.99,518 ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఖాతాలోని బ్యాలెన్స్‌ను పరిశీలించినప్పుడు డబ్బులు పోయిన విషయం తెలిసి ఆమె షాక్‌కు గురైంది.
పెళ్లి కోసం దాచిన డబ్బులు:
ఆకాంక్ష కుటుంబం ఆమె పెళ్లి ఖర్చుల కోసం ఇంట్లో సబ్‌మెర్సిబుల్ వాటర్ పంపు ఏర్పాటు చేసుకోవడం కోసం కష్టపడి డబ్బులు దాచుకుంది. ఆ మొత్తమే సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డబ్బులు పోయిన విషయం తెలిసిన వెంటనే ఆమె తన తండ్రికి సమాచారం ఇచ్చింది. ఇద్దరూ బ్యాంకుకు వెళ్లేలోపే బ్యాంకు మూసివేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Indian Railways: తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రైల్వే రీఫండ్ రూల్స్ ఇవే!
ఇది కూడా చదవండి: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




