దేశంలో ఇన్స్టాంట్ డెలివరీ యాప్‌లకు భారీగా ప్రజాదరణ లభిస్తోంది. కేవలం 10 నిమిషాల్లో కిరాణ సామగ్రి, ఆహారం డెలివరీ అవుతుండటంతో ప్రజల పనిని సులభతరం అవుతోంది. బట్టల నుంచి ఫుడ్ వరకు అన్ని క్విక్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి ఈ రంగాలను డామినేట్ చేస్తున్నాయి. తాజాగా క్యాబ్ సర్వీసెస్ దిగ్గజం ఓలా కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఓలా కంపెనీ ‘డాష్’ పేరుతో క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో జొమాటో, స్విగ్గీకి మరో ప్రధాన పోటీదారు ఎదురవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓలా సహా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాం సాయంతో దేశంలో ఊపు మీద ఉన్న క్విక్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఓఎన్డీసీ పట్ల తమ నిబద్ధత ఉందని ఆయన పేర్కొన్నారు. నేడు భారత్ వ్యాప్తంగా ఆహారం, నిత్యావసర వస్తువుల డెలివరీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇందులో 10 నిమిషాల్లోనే అందించే క్విక్ ఫుడ్ డెలివరీ కూడా ఉందని తెలిపారు.
ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ X పోస్ట్
Yep, taking our @Olacabs commitment to @ONDC_Official to the next level! Scaling food and other categories across India today. Including 10min food.
ONDC is the future of commerce! https://t.co/wrknQhtnuG
— Bhavish Aggarwal (@bhash) December 18, 2024
దేశంలో ఓఎన్డీసీ వాణిజ్య భవిష్యత్తు అని అగర్వాల్ ఉద్ఘాటించారు. ఓఎన్డీసీ అనేది డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా వస్తువులు, ఇతర సేవల డెలివరీ కోసం ఓపెన్ నెట్‌వర్క్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఓలా తన డాష్ సేవలను బెంగళూరులో మాత్రమే అందిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తుంది. నివేదికల ప్రకారం ఓలా ప్రధాన అప్లికేషన్‌లోని ఫుడ్ సెక్షన్లో డాష్ సేవలను అందిస్తోంది.
డాష్ అనేది ఓలా కంపెనీకి చెందిన పాత అప్లికేషన్. 10 నిమిషాల్లో కిరాణా సామగ్రిని డెలివరీ చేసేందుకు దీన్ని 2022లో ప్రారంభించారు. అయితే 6 నెలల పాటు కొనసాగించి ఆ తర్వాత యాప్ కార్యాకలపాలను ఓలా నిలిపివేసింది. అయితే, ఓలా పోటీ దారులైనా జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి ఇంకా ఈ రంగంలో కొనసాగుతున్నారు.