AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10 లక్షలకు పైగా విలువైన కారు కొంటే TCS తప్పనిసరి.. కానీ రీఫండ్ కూడా పొందొచ్చు! ఎలాగంటే?

రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన కారు కొనుగోలు చేసినప్పుడు చెల్లించే 1 శాతం TCSను తిరిగి పొందవచ్చని చాలా మందికి తెలియదు. ఇది అదనపు ఖర్చు కాదు, ముందస్తు పన్ను. కొనుగోలుదారులు ITR దాఖలు చేసేటప్పుడు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు లేదా రీఫండ్‌గా పొందవచ్చు.

రూ.10 లక్షలకు పైగా విలువైన కారు కొంటే TCS తప్పనిసరి.. కానీ రీఫండ్ కూడా పొందొచ్చు! ఎలాగంటే?
Car Tcs Refund
SN Pasha
|

Updated on: May 12, 2026 | 10:45 PM

Share

ఈ రోజుల్లో కారు కొనుగోలు ఖర్చులు కేవలం EMIలు, బీమా, రిజిస్ట్రేషన్ ఫీజులతో మాత్రమే ముగియడం లేదు. రూ.10 లక్షలకు మించి విలువైన కారు కొంటే, కొనుగోలుదారులు అదనంగా TCS (టాక్స్ కలెక్టేడ్‌ ఎట్ సోర్స్) కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది దీనిని తిరిగి పొందే అవకాశం ఉందన్న విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206C(1F) ప్రకారం రూ.10 లక్షలకు పైగా విలువైన మోటారు వాహనం కొనుగోలు చేస్తే డీలర్ 1 శాతం TCS వసూలు చేయాలి. ఉదాహరణకు, రూ.15 లక్షల కారు కొంటే అదనంగా రూ.15,000 TCSగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డీలర్ ప్రభుత్వానికి జమ చేసి, కొనుగోలుదారుడి PAN నంబర్‌కు లింక్ చేస్తాడు.

ఈ నియమం కేవలం లగ్జరీ కార్లకే కాదు, రూ.10 లక్షలకంటే ఎక్కువ ధర ఉన్న అన్ని వాహనాలకు వర్తిస్తుంది. వ్యక్తిగత వినియోగం, వ్యాపార అవసరాల కోసం కొన్నా ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మినహాయింపు ఉంటుంది. నిపుణుల ప్రకారం చాలా మంది TCSను తిరిగి రాని అదనపు ఖర్చుగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది ముందుగానే చెల్లించిన పన్నుల్లాంటిదే. ఫారం 26AS, AISలో ఈ మొత్తం కనిపిస్తుంది. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో దీనిని పన్ను బాధ్యతకు సర్దుబాటు చేసుకోవచ్చు లేదా రీఫండ్ రూపంలో పొందవచ్చు.

వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి తక్కువగా ఉన్నా, లేదా మొత్తం పన్ను బాధ్యత TCS కంటే తక్కువగా ఉన్నా పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫారం 27D, PAN, కొనుగోలు ఇన్వాయిస్, TCS చెల్లింపు రుజువులు అవసరం. రిటర్న్ దాఖలు చేసే ముందు ఫారం 26ASలో TCS వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన వివరాలు ఉంటే రీఫండ్ సాధారణంగా రెండు నుంచి మూడు నెలల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us