Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్

|

Jul 02, 2021 | 12:06 PM

Telecom Mobile Tariff: చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి.

Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్
Airtel Tariff Hike
Follow us on

Airtel Tariff: మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌లను పెంచేందుకు దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలానికి పైగా మొబైల్ టారిఫ్‌లను పెంచలేదు. చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి. టెలికాం రంగంలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడిని అధిగమించేందుకు టారిఫ్‌లు పెంచాలని ఎయిర్ టెల్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వరకే పలు సందర్భాల్లో టారిఫ్‌లను పెంచాల్సిన అవసరముందని ఎయిర్ టెల్ అభిప్రాయపడింది. అయితే ఎయిర్ టెల్ ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధంగా లేదని, ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసిరావాలని కోరుతోంది. తాజాగా టారిఫ్‌ల పెంపుపై భారతి ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ క్లారిటీ ఇచ్చారు. ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసొస్తే టారిఫ్‌లను పెంచేందుకు తాము వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు.

అయితే ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేమని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. టారిఫ్‌లను భారీగా పెంచాలని తాము భావించడం లేదన్నారు. అయితే టెలికాం మార్కెట్‌ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంత మేర ఛార్జీలను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మిగిలిన టెలికాం సంస్థలు కూడా టారిఫ్‌లు పెంచేందుకు తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

Airtel Bharati Chairman Sunil Mittal

టారిఫ్‌ల పెంపు సాధ్యమేనా?

టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్ టెల్ ఉవ్విళ్లూరుతున్నా…ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యంకాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియలన్స్ జియో, గూగుల్‌తో కలిసి ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 10న ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తే దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల మధ్య పోటీ మరింత తారస్థాయికి చేరే అవకాశముంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా దేశంలో తన కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని రిలయన్స్ జియో భావిస్తోంది. ఈ తరుణంలో టారిఫ్‌లను పెంచేందుకు రిలయన్స్ జియో సముఖత వ్యక్తంచేసే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read..

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

ఇలాంటి చికెన్ ప్రియుడ్ని మీ జీవితంలో చూసి ఉండరు..! దొంగలు పడ్డా అలాగే..