
మన ఇండియన్ మహిళలకు బంగారంపై మక్కువ మరీ ఎక్కువే. అందుకేనేమో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండే గోల్డ్ నిల్వల కంటే.. భారత మహిళల దగ్గరే గోల్డ్ ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు గణనీయంగా పెరిగిన ధరలకు.. కొనాలంటేనే భయపడుతున్నారు జనాలు. మరి 2026లో గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆసియా మార్కెట్లలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో బంగారు నగలపై పన్ను మినహాయింపును తొలగించడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఇకపై బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం కారణంగా ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడాన్ని తగ్గించారని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రజలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా, ఆభరణాల మార్కెట్లో కస్టమర్ల నుంచి డిమాండ్ కొరవడింది. ఈ డిమాండ్ లేమి కారణంగా, రాబోయే కొత్త సంవత్సరంలో బంగారు ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, దీనికి వ్యతిరేకంగా ఇతర దేశాల్లో బంగారం ధర మళ్లీ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకువెళ్తున్నాయి. పసిడి ధరలు నెల రోజుల క్రితం గరిష్ట స్థాయిని తిరిగి అందుకున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా డాలర్ బలహీనపడుతుండగా.. బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. పెట్టుబడుదారులు అధిక వడ్డీ వస్తుండటంతో ఫెడరల్ రిజర్వ్ జారీ చేసిన ట్రెజరీ బాండ్లలోపెట్టుబడులు పెడుతుంటారు. అయితే డాలర్ విలువ తగ్గే కొద్దీ. వచ్చే రాబడి తగ్గిపోతుంది. దానితో వారంతా తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్ల నుంచి ఉపసంహరించుకుని, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతారు. ఇది బంగారం డిమాండ్‌ను పెంచి, తద్వారా ధరలు పెరగడానికి దారితీస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఈ పరిస్థితుల కారణంగానే దేశంలో బంగారం ధర పెరగడం ప్రారంభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే కొత్త సంవత్సరం 2026లో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం చాలామందిలో ఉంది. బంగారం ధరల హెచ్చుతగ్గులు ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వార్తలు వస్తుండటంతో బంగారం ధర 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.