
మార్చి 31 వచ్చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇదే చివరి రోజు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానుంది. దీంతో మార్చి 31వ తేదీ అత్యంత కీలకమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ధిక కార్యకలాపాలను ప్రభావితం చేసే అనేక విషయాలకు నేటితో గడువు ముగియనుంది. ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ పనులు, ఫారాలు దాఖలకు సంబంధించి నేటితో గడువు ముగియనుంది. మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా ఇన్‌కమ్ ట్యాక్స్, ఎల్‌ఐసీ ఆఫీసులు తెరిచే ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. నేటితో చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం.
సెక్షన్ 80సీ కింద పాత పన్ను విధానంలో రూ.1.5 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనం పొందేందుకు మార్చి 31 చివరిరోజు. ఈ తేదీలోగా పీపీఎప్, సుకన్య సమృద్ది యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్, జీవిత బీమా ప్రీమియంలలో మీ పెట్టుబడులను పూర్తి చేయండి. ఆ అకౌంట్లను యాక్టివ్‌గా ఉంచడానికి మినిమం వార్షిక బ్యాలెన్స్ జమ చేసేందుకు నేటి వరకు మాత్రమే గడువు ఉంది. ఇక ఆర్బీఐ, సెబీ నియమాల ప్రకారం బ్యాంకు అకౌంట్లు, డీమ్యాట్ ఖాతాలకు నామినీని పొందుపర్చాలి. లేకపోతే అకౌంట్లు ఇనాక్టివ్ అవ్వవచ్చు.
2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అప్డేట్ చేసిన రిటర్నులను దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. బడ్జెట్ 2025లో ఈ గడువును 4 సంవత్సరాలకు పొడిగించగా.. నేడు చివరి రోజు. ఇక ఆధార్‌తో పాన్ కార్డు అప్లై చేసుకునేందుకు నేడే చివరి తేదీ. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ దరఖాస్తులకు ఆధార్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు తమ ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్లను సమర్పించాలి. దీని వల్ల గత నెల జీతం కంటే ఎక్కువగా టీడీఎస్ మినహాయిస్తారు.
ఇక విదేశీ ఆదాయంపై పన్ను ప్రయోజనానికి క్లెయిమ్ చేసేందుకు ఫారం 67 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది దాఖలు చేయడానికి మార్చి 31 చివరి రోజు. ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు తమ స్టాక్‌లను అమ్మి నష్టాలను సర్దుబాటు చేసుకుకని మూలధన లాభాల పన్ను ఆదా చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. దేశ ప్రజల ఆర్ధిక వ్యవహారాలను ప్రభావితం చేసే ఈవిషయాల గురించి అందరూ తెలుసుని వెంటనే పని పూర్తి చేసుకోవాలి. లేకపోతే రేపటి నుంచి అంతరాయం ఎదురుకావొచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.