
దేశీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ మరోసారి తన సేవింగ్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ వినియోగదారులకు రెండు కొత్త బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. ఎల్‌ఐసీ న్యూ జీవన్ సతీ – సింగిల్ ప్రీమియం, ఎల్‌ఐసీ న్యూ జీవన్ సతీ – లిమిటెడ్ ప్రీమియం పేరుతో ఈ కొత్త ప్లాన్లను జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్థిరమైన రాబడులతో పాటు భద్రమైన సేవింగ్స్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాలను రూపొందించినట్లు ఎల్‌ఐసీ తెలిపింది.
ఈ రెండు ప్లాన్లు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ సేవింగ్స్ పథకాలుగా ఉండటం విశేషం. అంటే, ఇవి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు ఎలాంటి సంబంధం లేకుండా పనిచేస్తాయి. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారెంటీడ్ సేవింగ్స్ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి. పాలసీ మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీదారుడి మరణం సంభవించినప్పుడు అందే ప్రయోజనాలు ముందుగానే నిర్ణయించబడి, గ్యారెంటీగా లభిస్తాయని సంస్థ వెల్లడించింది.
ప్రీమియం చెల్లింపులో వినియోగదారులకు రెండు ఎంపికలను అందించారు. సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో పాలసీ ప్రారంభ సమయంలోనే మొత్తం ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్‌లో మాత్రం నిర్ణీత కాలం పాటు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక చేసుకునే వారికి కొంత వెసులుబాటు లభిస్తుంది.
ప్రస్తుతం పెరుగుతున్న మార్కెట్ అస్థిరత నేపథ్యంలో, భద్రతతో కూడిన సేవింగ్స్ పథకాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ తీసుకొచ్చిన కొత్త ప్లాన్లు మధ్యతరగతి కుటుంబాలు, దీర్ఘకాలిక పొదుపు లక్ష్యాలు కలిగిన పెట్టుబడిదారులకు ఉపయోగపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పాలసీదారుల వయస్సు, హామీ మొత్తం ఆధారంగా ప్రీమియం వివరాలను జూన్ 1న అధికారికంగా ప్రకటించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి