Sukanya Samriddhi Yojana: గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్ గురించి ఆందోళన పడుతుంటారు. వారి చదువు, పెళ్లికయ్యే ఖర్చుల గురించి ఆలోచిస్తూ మదనపడుతారు. కానీ ఇప్పుడు వారి అవసరాలను ప్రభుత్వం గుర్తించి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించింది. పోస్టాఫీసులో ఆడపిల్లల పేరుపై ఖాతా తెరిచి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు. వారి అవసరాలన్ని తీరిపోతాయి. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం అందుబాటులో ఉంటుంది.
ఖాతాకు అవసరమైన పత్రాలు:
– ఈ పథకం ఫారమ్
– లబ్దిదారుని జనన ధృవీకరణ పత్రం
– లబ్దిదారుని తల్లిదండ్రుల చిరునామా పత్రం
– లబ్దిదారుని తల్లిదండ్రుల ఐడీ పత్రం
– ఆధార్, ఇతర పత్రాలు
పథకం వివరాలు:
► ఈ పథకంలో డిపాజిట్లు ఖాతా తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేయవచ్చు.
► ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు.
► ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం ప్రతి డిఫాల్ట్‌కి సంవత్సరానికి రూ. 50 పెనాల్టీతో కనీసం రూ. 250 చెల్లించాలి.
► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.
►ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
► పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు.
► ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి నుంచి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉపసంహరణ చేయవచ్చు.
సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు:
సుకన్య సమృద్ధి యోజన కింద ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద భారతదేశంలోని బాలికల పేరుతో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తెరిచేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
వడ్డీ రేట్లు..
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకుంటారు. ఈ ఖాతాని10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్ల పేరు మీద తెరవవచ్చు. ఈ ఖాతా 21 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు.