Electric Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. వెళ్తుంది.. ఖమ్మం కుర్రాడి నూతన ఆవిష్కరణ..
సంకల్పం వుంటే చాలు అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చని నిరూపించాడు ఖమ్మంకు చెందిన రాకేష్. ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు...
సంకల్పం వుంటే చాలు అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చని నిరూపించాడు ఖమ్మంకు చెందిన రాకేష్. ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులను హడలెత్తిస్తున్న వేళ ఖమ్మం కుర్రోడు స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా రూపొందించాడు. బైక్ నడుస్తున్నప్పుడే ముందు చక్రం ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అయ్యేవిధంగా టెక్నాలజీ రూపొందించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
రాకేష్ తండ్రి టైలర్, తల్లి గృహిణి రాకేష్ నగరంలోని కిట్స్ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే రాకేష్‌కు ఇష్టం తన స్నేహితుల సహాయంతో ఎక్కువ సేపు నడిచే బ్యాటరీని తయారు చేశాడు. వివిధ వాహనాల విడిభాగాలు సేకరించి తన ఆవిష్కరణకు అనుకూలమైన విధంగా ద్విచక్ర వాహనం తయారు చేసి దానికి అధిక శక్తి ఇచ్చే విధంగా బ్యాటరీ తయారు చేశాడు. దాన్ని ప్రస్తుతం తాను నడుపుతూ వాహన పనితనాన్ని పరిశీలిస్తున్నారు రాకేష్. నగరంలో ఆ బండి గురించి తెలిసి ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. రాకేష్ చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రికల్ వస్తువుల మీద ఆసక్తి చూపేవాడని రాకేష్ తండ్రి చెప్పారు. ఏదో సాధించాలన్న తపన ఎప్పుడూ రాకేష్‌లో ఉండేదని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తన స్నేహితులతో ఆలోచించి ఈ బైక్ రూపొందిచడానికి నిర్ణయించాడు. అధిక శక్తి ఉన్న బ్యాటరీలు తెప్పించి ద్విచక్ర వాహనంకు అమర్చడం వల్ల 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని, దానికి డైనమో అమర్చడం వల్ల బ్యాటరీ సామర్థ్యం పెరిగి 300 కిలోమీటర్ల వరకు వెళ్తుందని రాకేష్ అన్నారు. అంతే కాదు తను తయారు చేసిన ఈ ఎలక్ట్రికల్ వాహనానికి ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేశాడు. మొబైల్ ద్వారా ఈ వాహనాన్ని అన్, అప్ చేయవచ్చు ,మొబైల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఈ వాహనానికి ఏర్పాటు చేశాడు. బ్యాటరీ పవర్ ఇండికేషన్, ఎంతదూరం ప్రయాణం చేయవచ్చు అన్ని విషయాలు కూడా తెలుసుకునే విధంగా దీన్ని రూపొందించాడు. డైనమోలను వాహన చక్రాలకు అనుసంధానం చేసి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తూ బ్యాటరీ రీఛార్జ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశాడు. దానివల్ల వాహనంకు మరికొంత మైలేజ్ కూడా వస్తుంది. అయితే మొత్తం ఈ వాహనం తయారు చేయడానికి లక్షరూపాయల వరకు ఖర్చు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో ఖమ్మం నగరంలో గ్యారేజ్ పెట్టి ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తానని రాకేష్ చెబుతున్నాడు.
ఖమ్మం కుర్రాడు నూతన ఆవిష్కరణ ద్వారా అధిక మైలేజ్ ఇచ్చే వాహనాన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వాహనాల వినియోగం పెరిగిందని ప్రతీ వ్యక్తికి బైక్ అనేది అవసరం అవుతుందని చెప్పారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని ఇలా కరెంట్ ద్వారా ఎక్కువ మైలేజ్ ఇచ్చే విధంగా యువకుడు తయారు చేసిన వాహనం సామాన్య ప్రజలకు అవసరమని పేర్కొన్నారు.
Read Also.. High Court: మరోసారి తెరపైకి మరియమ్మ లాకప్ డెత్ కేసు.. సీబీఐ దర్యాప్తు అవసరమన్న హైకోర్టు ధర్మాసనం!