Jio IPO: జియో ప్లాట్ఫామ్స్ రూ.30,213 కోట్ల మెగా ఐపీఓ.. త్వరలోనే పూర్తి రుణ రహిత సంస్థగా అవతరణ..
Reliance Jio IPO: ఒక్క రూపాయి కూడా ఆఫర్ ఫర్ సేల్ లేదు.. మొత్తం ఫ్రెష్ ఇష్యూనే.. దాదాపు రూ.10.3 లక్షల కోట్ల విలువతో వస్తున్న జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓపై ఇప్పుడు ప్రపంచ ఇన్వెస్టర్ల కళ్లన్నీ పడ్డాయి. ఐపీఓ ద్వారా సేకరించే రూ.30,213 కోట్లలో సింహభాగం అప్పులు తీర్చడానికే కేటాయిస్తూ ఆకాష్ అంబానీ తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైన జియో ప్లాట్ఫామ్స్ (Jio IPO) త్వరలోనే పూర్తిస్థాయిలో రుణ రహిత సంస్థగా అవతరించబోతుంది. రానున్న రూ.30,213 కోట్ల భారీ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను ప్రధానంగా కంపెనీకున్న అప్పుల చెల్లింపులకే వినియోగించనున్నట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ స్పష్టం చేశారు. ఐపీఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. సంస్థ రుణాల భారాన్ని తగ్గించుకుని, బ్యాలెన్స్ షీట్ను మరింత బలోపేతం చేసుకుంటూ సరికొత్త వృద్ధి దశలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.
ఐపీఓ నిధులన్నీ అప్పుల చెల్లింపులకే..
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టిస్తున్న జియో ప్లాట్ఫామ్స్ ఇష్యూలో.. షేరు ధర శ్రేణిని రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. ఈ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది. ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధర ప్రకారం 27 కోట్ల తాజా షేర్ల విక్రయం ద్వారా సంస్థ మొత్తం రూ.30,213 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ ముసాయిదా పత్రాల ప్రకారం.. ఇందులో ఏకంగా రూ.27,500 కోట్లను జియో ప్లాట్ఫామ్స్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తీసుకున్న పాత రుణాల ముందస్తు లేదా పూర్తి చెల్లింపులకే కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
ఓఎఫ్ఎస్ లేదు.. అంతా ఫ్రెష్ ఇష్యూనే..
గతంలో వచ్చిన అనేక భారీ ఐపీఓల మాదిరిగా కాకుండా జియో ఐపీఓ మొత్తం సరికొత్త షేర్లతోనే కూడుకుని ఉండటం విశేషం. ఇందులో ప్రమోటర్లు గానీ, ప్రస్తుత వాటాదారులు గానీ తమ వాటాలను విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ విధానం ఏదీ లేదు. ఫలితంగా ఐపీఓ ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా కంపెనీ ఖాతాకే జమకానుంది. ఇది సంస్థ దీర్ఘకాలిక మూలధన వృద్ధికి, ఆర్థిక పటిష్టతకు మరింత ఊతమివ్వనుంది.
తగ్గనున్న వడ్డీ భారం.. పెరగనున్న లాభదాయకత
భారీగా అప్పులు తీర్చివేయడం ద్వారా కంపెనీకి వడ్డీ వ్యయాలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇది రాబోయే రోజుల్లో సంస్థ లాభదాయకతను పెంచడంతో పాటు ఉచిత నగదు ప్రవాహాన్ని భారీగా పెంచుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ విస్తరణ, సొంత సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన జియో.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.76,000 కోట్ల ఎబిట్డా నమోదు చేసింది. గత మూడేళ్లలో కంపెనీ 17.8 శాతం వార్షిక వృద్ధి రేటును కనబరిచినట్లు ఆకాష్ అంబానీ గుర్తుచేశారు.
కేవలం రీఛార్జ్ ధరల పెంపుపైనే ఆధారం పడం
కంపెనీ తదుపరి దశ వృద్ధి వ్యూహాల గురించి వివరిస్తూ.. కేవలం టెలికాం టారిఫ్లను పెంచడం ద్వారానే ఆదాయాన్ని రాబట్టడం తమ లక్ష్యం కాదని ఆకాష్ అంబానీ తేల్చిచెప్పారు. కస్టమర్లపై భారం మోపకుండా కొత్త డిజిటల్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు, 5G ఆధారిత సర్వీసులను అందించడం ద్వారా ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకుంటామని స్పష్టం చేశారు. ‘‘ధరలను పెంచే వెసులుబాటు మాకు ఎప్పుడూ ఉంటుంది.. కానీ మా ప్రాధాన్యత కస్టమర్లకు మరింత నాణ్యమైన, అదనపు సేవలను అందించడమే’’ అని ఆయన వెల్లడించారు.
అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్
భారత మార్కెట్లలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్న జియో ప్లాట్ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. ప్రైస్ బ్యాండ్ గరిష్ట స్థాయి ప్రకారం చూస్తే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. రుణ రహిత లక్ష్యంతో మార్కెట్లోకి అడుగుపెడుతున్న జియో ఐపీఓ భారతీయ మదుపరులతో పాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
