దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ జోరందుకుంది. జూన్ 15వ తేదీ తర్వాత ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 అందిస్తోంది. దీంతో పాటు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. గడువు పూర్తి కాకముందే ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడం మేలు. అయితే ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా చిన్నపాటి పొరపాట్లు జరిగిన ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలాంటి పొరపాటు జరిగినా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందడం ఖాయం.
అయితే పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. సాలరీ పొందే ఉద్యోగులు ట్యాక్స్ చెల్లింపుదారులకు ఫారం-16 ఉపయోగపడనుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు సాలరీ కాకుండా వేరే చోట సంపాదిస్తున్నయితే ఈ ఫారం-16 వల్ల ఉపయోగం ఉండదు.
ఏదైనా ఇతర వనరుల నుంచి ఆదాయం విషయంలో కొన్ని పత్రాలు తప్పనిసరి కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఆదాయపు పన్ను శాఖ ఏఐఎస్, టీఐఎస్‌లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ప్రతి పన్ను చెల్లింపుదారునికి AIS, TISకి యాక్సెస్‌ను అందిస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో పారదర్శకత తీసుకురావడానికి, అలాగే ట్యాక్స్ పన్ను చెల్లింపుదారులకు ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఈ రెండింటినీ ప్రవేశపెట్టింది. ఈ రెండు పత్రాలు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడాన్ని సులభతరం చేయడమే కాకుండా వాటిని సరిపోల్చడం వల్ల తప్పులు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
అన్నింటికంటే ముందుగా ఈ ఏఐఎస్, టీఐఎస్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. AIS అంటే అన్యూల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్(వార్షిక సమాచార ప్రకటన), అదే TIS అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (పన్ను చెల్లింపుదారుల సమాచారం). ఇందులో మీరు సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు ఉంటాయి. మీరు సేవింగ్స్ ఖాతా, రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆదాయం, సెక్యూరిటీల లావాదేవీలతో సహా డివిడెండ్ డబ్బు, మ్యూచువల్ ఫండ్ నుంచి వడ్డీ రూపంలో సంపాదించడం వంటి అన్ని వివరాలు ఈ డాక్యుమెంట్‌లలో ఉంటాయి.
ఇక సరళంగా చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులు ఏఐఎస్‌లో పన్ను విధించదగిన మొత్తం సమాచారాన్ని పొందుతారు. ఏఐఎస్‌లో మీరు ఆదాయపు పన్ను చట్టం 1961 కింద పేర్కొన్న జీతం కాకుండా ఇతర ఆధారాల నుంచి ప్రతి ఆదాయ వివరాలను పొందుతారు.