స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది ఐటీ స్టాక్స్ జోరు మీద ఉన్నాయి. గత రెండు నెలలుగా ఐటీ రంగ స్పీడ్ బుల్ ఆపరేటర్లకు గందరగోళానికి గురి చేస్తున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ స్టాక్స్ అత్యంత ఖరీదుగా ట్రేడవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని కంపెనీల షేర్లు ఐదేళ్ల గరిష్ఠాలను దాటి అంటే ప్లస్–3 స్టాండర్డ్ డీవియేషన్‌లో కదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా కోవిడ్–19 తదుపరి ఐటీ సేవలపై వ్యయాలు పెరగడం కారణమవుతున్నట్లు వివరించారు.
సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగం 2004–07 మధ్య కాలంలో నమోదైన బుల్లిష్ దశలో ప్రవేశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అమ్మకాల పరిమాణం, ధరలపై అజమాయిషీ చేయగల సామర్థ్యం, సరఫరాలో సవాళ్లున్నప్పటికీ మార్జిన్లను నిలుపుకోగలగడం వంటి అంశాలు సానుకూలతను కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఐటీ రంగం అధిక వృద్ధి బాటలో సాగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక (జులై–సెప్టెంబర్) ఫలితాలు స్వల్ప, మధ్యకాలంలో ఈ ట్రెండ్ కొనసాగవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయగలవని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఐటీ రంగ లాభాలు సగటున 20 శాతం పుంజుకోగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 18 శాతం వృద్ధి నమోదుకాగలదని ఊహిస్తున్నాయి.
దేశీ ఐటీ రంగం జోష్ కొనసాగనున్నట్లు గత వారం ఫిలిప్ క్యాపిటల్ పేర్కొంది. ఇందుకు ఆరు కారణాలను ప్రస్తావించింది. ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ వేసిన సానుకూల అంచనాలు, గ్లోబల్ మార్కెట్లలో బలపడనున్న వాటా, పటిష్ట డీల్ పైప్‌లైన్, ధరలపై పట్టు, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పేర్కొంది. ఇలాంటి పలు సానుకూల అంశాలతో దేశీ ఐటీ రంగ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకే గత ఏడాది కాలంలో ఐటీ రంగ రేటింగ్ మెరుగుపడినట్లు వివరించింది. వెరసి సమీప భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో నెలకొన్న జోష్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది.
ఐటీ స్టాక్స్
కంపెనీ పేరు | జనవరి | ప్రస్తుతం |
---|---|---|
టీసీఎస్ | 3032 | 3833 |
ఇన్ఫోసిస్ | 1,240 | 1,692 |
విప్రో | 418 | 646 |
టెక్‌మహీంద్రా | 962 | 1412 |
హెచ్‌సీఎల్ టెక్ | 915 | 1305 |
మైండ్‌ట్రీ | 1,643 | 4287 |
ఎల్‌అండ్‌టీ టెక్ | 2,429 | 4,627 |
Read Also..
Facebook, Instagram and Whatsapp down: ఆరు గంటలపాటు ఉత్కంఠ.. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్లే..