Saving: నెలకు కేవలం రూ.1000 సేవ్ చేస్తే అంత లాభమా.. మంచి రాబడికోసం ఇలా ఇన్వెస్ట్ చేయండి..

Saving: తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. పెద్ద మెుత్తాల్లో సేవ్ చేయాలని ఎదురు చూడటం మంచిది కాదు. తక్కువ మెుత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి కార్పస్ బిల్డ్ చేయటానికి వీటిలో పెట్టుబడి పెట్టండి.

Saving: నెలకు కేవలం రూ.1000 సేవ్ చేస్తే అంత లాభమా.. మంచి రాబడికోసం ఇలా ఇన్వెస్ట్ చేయండి..
Savings
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 06, 2022 | 9:48 AM

Saving: అమృత ఇప్పుడే కెరీర్ ను ప్రారంభించింది. ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ అంటే అందరీకి థ్రిల్ ఉంటుంది. కానీ ఆమె తండ్రికి ఇది అర్థం కాలేదు. ఆయన మాత్రం పొదుపు, పెట్టుబడి(Investment) ప్రాముఖ్యతపై ఆమెకు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. కానీ అమృత తన నెలవారీ పొదుపు మోడెస్ట్ గా ఉంటే.. పెట్టుబడిని ఎలా ప్రారంభించాలో అర్థం కాక గందరగోళంలో పడింది. కెరీర్ స్టార్టింగ్‌లో(Career Starting) చాలా మంది చేసే తప్పునే అమృత కూడా చేస్తోంది. పెద్దగా పొదుపు చేయలేక చాలా మంది తమ పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేస్తూ ఉంటారు. నెలలో 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పొదుపు చేయలేక పోతే.. కనీసం వెయ్యి రూపాయలైనా ఆదా చేయాలి. ఈ చిన్న మెుత్తాన్ని కూడా సేవ్ చేయలేక పోతే.., మీ ఖర్చుల్లో కొంత భాగాన్ని తగ్గించుకోవటం ద్వారానైనా నెలకు 1000 రూపాయలు ఆదా చేసి పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించాలి. ఇప్పుడు ప్రతి నెలా ఈ 1000 రూపాయలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న తలెత్తుతుంది. నెలవారీ 1,000 రూపాయలు పెట్టుబడి కోసం మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఇవి చిన్న మొత్తంలో పొదుపు నుంచి కార్పస్‌ను బిల్డ్ చేయటంలో మీకు సహాయపడతాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..

మీరు మొదటిసారి పెట్టుబడి పెడుతున్నట్లయితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF మంచి ఎంపిక. ఇది 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉన్నప్పటికీ.. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ లభించటం వల్ల పెట్టుబడి మెుత్తం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ప్రతి నెలా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే.. ఒక సంవత్సరంలో మీ పెట్టుబడి 12 వేల రూపాయలు అవుతుంది. మీరు 15 సంవత్సరాల పాటు రెగ్యులర్ గా డిపాజిట్లు చేస్తూనే ఉంటే.. అప్పుడు 1,80,000 రూపాయలు పెట్టుబడిగా పెడతారు.

ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 7.1 శాతంతో లెక్కిస్తే.. మొత్తం వడ్డీ 1,45, 457 రూపాయలు అవుతుంది. అంటే మెుత్తం కార్పస్ 3లక్షల25వేల 457 రూపాయలకు చేరుతుంది. అంటే నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు 3.25 లక్షల రూపాయల కార్పస్‌ను బిల్డ్ చేయగలుగుతారు. పైగా పీపీఎఫ్ల లో లక్షన్నర వరకు చేసే పెట్టుబడులకు ఆదాయుపన్నులోని సెక్షన్-80C కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ, ఉపసంహరణ మొత్తంపై పన్ను విధించబడదు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు PPF ఖాతాను బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో తెరవవచ్చు.

రికరింగ్ డిపాజిట్..

మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టకూడదనుకుంటే.., స్వల్పకాలిక రికరింగ్ డిపాజిట్ లను ఎంచుకోవచ్చు. ఇందులో నెలకు1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు. మీరు PPF కంటే RD పై తక్కువ వడ్డీని పొందుతారు. కానీ.. మీకు బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. RD చాలా వరకు FDని పోలి ఉంటుంది. కానీ దీనిలో ఉన్న చిన్న తేడా ఏమిటంటే RDలో నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు లేదా పోస్టాఫీసులు RD ఖాతా తెరిచే సౌకర్యాన్ని అందిస్తాయి. 6 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉండే RDలను బ్యాంకులో తెరవవచ్చు. పోస్టాఫీసులో గరిష్ఠంగా ఐదేళ్ల కాలపరిమితి ఉండే RD మాత్రమే ఉంటుంది. ఈ పథకంలో కనీసం వంద రూపాయల నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇన్వెస్ట్ చేసేందుకు ఎటువంటి గరిష్ఠ పరిమితి లేదు. పోస్టాఫీసు ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగా 5.8% వడ్డీని ఇస్తోంది.

మీరు పోస్టాఫీసు RD లో ప్రతి నెలా వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్లలో మీరు 60 వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మెచ్యూరిటీ సమయంలో 9, 694 రూపాయల వడ్డీతో కలిపి 69, 694 రూపాయలు పొందుతారు. బ్యాంక్ RD నుంచి వచ్చే వడ్డీ 40,000 రూపాయల కంటే ఎక్కవగా ఉంటే దాని నుంచి TDS డిడక్ట్ అవుతుంది. కానీ పోస్టాఫీసులో RD తెరిచి ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు TDS తగ్గిచటం జరగదు. కానీ.. మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుపుతారు. పెట్టుబడిదారుల పన్ను స్లాబ్ ప్రకారం ఈ వడ్డీపై పన్ను లెక్కిస్తారు. RD లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. మీరు RDలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడల్లా.. మొత్తం కాలానికి నిర్ణయించిన ఫిక్స్ డ్ ఇంటరెస్ట్ చెల్లిస్తారు.

మ్యూచువల్ ఫండ్..

ఇప్పుడు అందుబాటులో ఉన్న మూడవ ఎంపిక మ్యూచువల్ ఫండ్స్. ఇందులో రాబడి అధికంగా ఉండటమే కాక ఎటువంటి లాక్ ఇన్ పిరియడ్ ఉండదు. కానీ.. ఇందులో ప్రమాదం కూడా ఎక్కువని చెప్పుకోవాలి. యువ పెట్టుబడిదారులు డీమ్యాట్ ఖాతా తెరవకుండానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIP చేయవచ్చని మనీ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గ్యాంగ్ పేర్కొన్నారు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని అర్థం. దీని ద్వారా మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గత 5 సంవత్సరాల్లో 12-15 శాతం రాబడిని ఇచ్చింది. ఈ రాబడిని ప్రాతిపదికగా తీసుకుంటే.. సగటు రాబడి 10 శాతంగా తీసుకుందాం. ఐదు సంవత్సరాల పాటు నెలకు వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెడితే.. మెుత్తం ఇన్వెస్ట్ మెంట్ 60,000 రూపాయలు అవుతుంది. మెుత్తం రాబడి 78 వేల 082 రూపాయలుగా ఉంటుంది. ఇదే 1000 రూపాయలను 15 సంవత్సరాల పాటు పెట్టుబడిగా పెడితే.. 1,80,000 రూపాయల పెట్టుబడికి 4 లక్షల17వేల 924 రూపాయలు రాబడి లభిస్తుంది.

సూచన..

తగినంత డబ్బు ఆదా చేసిన తర్వాత మాత్రమే మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వదులుకోండి. మీరు పొదుపు చేసిన దాని నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పెట్టుబడి అనేది మిమ్మల్ని రాత్రికి రాత్రే ధనవంతులను చేసే క్విక్ రిచ్ స్కీమ్ కాదని గుర్తుంచుకోండి. మీరు మీ పెట్టుబడిని మరింతగా పెంచుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అంత పెద్ద ఫండ్‌ను మీరు సృష్టించగలరు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

EV Trucks: దేశంలో ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్కులు.. పూర్తి స్వదేశీ పరికరాలతో తయారీ.. వివరాలు..

Bank Rules: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపు.!