Telugu News Business Insurance claims what happens if both the policyholder and nominee die details in telugu
Insurance Claims: పాలసీదారుడు, నామినీ మరణిస్తే బీమా సొమ్ము వస్తుందా? నిపుణులు చెప్పే కీలక విషయాలు ఇవే..!
బీమా పాలసీ తీసుకునేటప్పుడు, చాలా మంది వ్యక్తులు అకాల మరణం సంభవించినప్పుడు తమపై ఆధారపడే వారికి ప్రయోజనం చేకూర్చేలా క్లెయిమ్ మొత్తం పొందాలనే సహజ ఉద్దేశ్యంతో వారి జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులను నామినీలుగా పేర్కొంటారు. అయితే కొన్నిసార్లు పాలసీదారుడితో పాటు నామినీ కూడా మరణించే విషాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ సమయంలో బీమా పాలసీ ఏమవతుందనే అనుమానం అందరికీ ఉంటుంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో బీమా పాలసీపై కీలక విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదాలు, విషాదాలు కుటుంబాలు ఒకేసారి ఎక్కువ మంది సభ్యులను కోల్పోయే పరిస్థితికి దారితీస్తాయి. అలాంటి సందర్భాలలో బీమా డబ్బును ఎలా క్లెయిమ్ చేయవచ్చు. మొదటి హక్కు ఎవరికి లభిస్తుంది? అనే అనుమానం అందరికీ ఉంటుంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రకారం పాలసీదారుడు, నామినీ ఒకే ప్రమాదంలో మరణిస్తే బీమా కంపెనీ పాలసీదారుడి తర్వాత నామినీ మరణించినట్లు భావించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో నామినీకు సంబంధించిన చట్టపరమైన వారసులు క్లెయిమ్‌కు అర్హులుగా పరిగణిస్తారు. బీమా సంస్థ నిబంధనలు, నిర్దిష్ట పాలసీని బట్టి తుది నిర్ణయాలు మారవచ్చు. అయితే ఈ సూత్రం సాధారణంగా వర్తిస్తుంది.
చట్టపరమైన వారసులు వీరే
హిందూ వారసత్వ చట్టం ప్రకారం (పురుష పాలసీదారునికి) ప్రాధాన్యతకు చట్టపరమైన క్రమం ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి. కొడుకు లేదా కుమార్తె మరణిస్తే పాలసీదారుడి మనవరాళ్ళు బీమా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న వారసులు లేకుంటే, ‘క్లాస్ 2 వారసులు’ పరిగణిస్తారు. వీరిలో తండ్రి, సోదరులు, సోదరీమణులు, మేనల్లుళ్లు, మేనకోడళ్ళు, తాతామామలు, ఇతరులు ఉన్నారు.
పాలసీదారునికి క్లాస్ 1 లేదా క్లాస్ 2 లో వారసులు లేకుంటే తండ్రి లేదా తల్లి వైపు నుండి బంధువులు వంటి విస్తృత కుటుంబం ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. చట్టపరమైన వారసుడు కనుగొనకపోతే బీమా మొత్తం ప్రభుత్వానికి బదిలీ చేస్తారు.
పాలసీని మహిళ పేరుపై ఉంటే?
మహిళా పాలసీదారునికి ఆమె భర్త, కుమారులు, కుమార్తెలకు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. వారిలో ఎవరూ జీవించి లేకుంటే భర్త కుటుంబం (తల్లిదండ్రులు, భర్త తోబుట్టువులు) తదుపరి హక్కును పొందుతారు. వారి తర్వాత ఆమె సొంత తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకుంటారు. తర్వాత ఆమె తండ్రి, తల్లి వారసులుగా ఉంటారు. అయితే స్త్రీ వీలునామా రాసి ఉంటే వీలునామా ప్రకారం చెల్లిస్తారు.
బీమా క్లెయిమ్ చేయడానికి అవసరమయ్యే పత్రాలు
పాలసీదారు, నామినీ ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు
ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ లేదా చెల్లుబాటు అయ్యే కాపీ
స్థానిక తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారి నుంచి పొందగలిగే లీగల్ హెయిర్ సర్టిఫికెట్
వీలునామాకుసంబంధించిన ధ్రువీకరించిన కాపీ
పెద్ద క్లెయిమ్‌లు లేదా వివాదాస్పద కేసుల కోసం కోర్టు నుంచి అవసరమైన వారసత్వ ధ్రువీకరణ పత్రం