Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రాబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. జులై 17వ తేదీన ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రైలుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే పట్టాలెక్కి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

దేశ రైల్వే చరిత్రలో మరో నూతన శకం మొదలుకానుంది. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు ప్రారంభ తేదీని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ నోటిఫై చేసింది. ఈ రైలు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అలాగే ఎలాంటి పొగ కూడా రాదు. ఇది ప్రారంభమైన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లను రైల్వేశాఖ ప్రారంభించే అవకాశముంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని రైళ్లను చూడవచ్చు. ఇప్పటికే తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది. ఏయే మార్గాల్లో సర్వీసులు అందించనుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
తొలి హైడ్రోజన్ రైలు త్వరలో ప్రారంభం
ఉత్తర రైల్వే పరిధిలోని ప్రత్యేక జింద్-సోనిపట్ సెక్షన్ మధ్య 10 కోచ్‌ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు నడవనుంది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో ఈ రైలు నడుస్తుంది. దీని గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైలును పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు. బ్రాడ్ గేజ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ రైలు.. ప్రస్తుతం 10 కోచ్‌లతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ ఆధారిత రైలుగా ప్రసిద్ది పొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గాన్ని పైలట్ కారిడార్‌గా ఎంపిక చేశారు. ఈ రైలు నిర్వహణ కోసం జింద్‌లో స్వదేశీ హైడ్రోజన్ నిల్వ , ఇంధనం నింపే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. పేలుడు పదార్థాల భద్రతా సంస్థ.. సదుపాయంలో సంపీడన హైడ్రోజన్ వాయువును నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన లైసెన్సును జారీ చేసింది.
హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుందంటే?
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ.. హైడ్రోజన్‌తో జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. గాలిలోని నీటి ఆవిరిని ఉపయోగించుకుని ఉత్పత్తి చేస్తుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడే సాంప్రదాయ ట్రాక్షన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది మరింత స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు జర్మనీ, జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ వంటివి హైడ్రోజన్ ఆధారిత రైళ్లను అభివృద్ది చేశాయి. ఇప్పుడు ఆ దేశాల సమూహంలో భారతదేశం కూడా చేరింది. స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా ఈ రైలును అభివృద్ది చేశారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుండగా.. దీని కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని రైలుసెట్లను తయారుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది.
