RBI MPC Meeting: ఒక పక్క ప్రపంచ బ్యాంక్ భారత జీడీపీ అంచనాలను రెండోసారి తగ్గించటం.. మరో పక్క నేడు రిజర్వు బ్యాంక్ ఎంపీసీ మీటింగ్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. రిజర్వు బ్యాంక్ ప్రకటన కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి. 9.50 గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 145 పాయింట్లు, నిఫ్టీ-50.. 42 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మరో సూచీ మిడ్ క్యాప్ నిఫ్టీ సైతం 104 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ వర్గాలు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పెపోరేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ రిజర్వు బ్యాంక్ మరింత రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటే ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటాయి. ఈ మధ్య కాలంలో రిటైల్ మదుపరులు సైతం ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల వారిపై ఈ రేట్ల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.