Indian Railways: రైల్వేశాఖ బిగ్ యాక్షన్.. 3 కోట్ల ఐడీలు బ్లాక్.. తత్కాల్ చీకటి దందాకు చెక్..
బోగస్ బుకింగ్‌లు, బాట్‌ల వల్ల తత్కాల్ టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. దీనిని అరికట్టేందుకు రైల్వేశాఖ ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నియమం ఇప్పటికే 322 రైళ్లలో అమలవుతోంది. నకిలీ ఐడీలను బ్లాక్ చేసి, బాట్‌లను నిరోధించడం ద్వారా నిజమైన ప్రయాణికులకు టికెట్లు సులువుగా లభిస్తాయి.

ట్రైన్ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద టాస్క్. క్షణాల్లో టికెట్లు అయిపోతాయి. దీనికి కారణం కొందరు దొంగ ఐడీలతో లేదా బాట్ హాయంతో త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడమే. అయితే బోగస్ బుకింగ్‌లు, బాట్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రైల్వేశాఖ ఒక ముఖ్యమైన మార్పు చేసింది. ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను తీసుకొచ్చింది. లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆధార్ OTP ఎందుకు?
ఇకపై ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేవారు, తమ గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఇప్పటికే 322 రైళ్లలో మొదలైంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో చెప్పారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా టికెట్ కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి కూడా త్వరలో ఈ రూల్‌ను అమలు చేయనున్నారు.
పెద్ద చర్యలు తీసుకున్న రైల్వే
రైల్వే కేవలం కొత్త రూల్ పెట్టడమే కాకుండా, చాలా కఠిన చర్యలు తీసుకుంది. ఫేక్ ఖాతాలను తొలగించడంలో భాగంగా ఏకంగా 3 కోట్ల 2 లక్షలకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను రైల్వే బ్లాక్ చేసింది. మోసాలను ఆపడానికి ఇది చాలా పెద్ద చర్య అని చెప్పొచ్చు. బుకింగ్ సమయంలో ఆటోమేటిక్‌గా పనిచేసే బాట్‌లను ఆపడానికి అకామై వంటి ప్రత్యేక సాధనాలను బుకింగ్ సిస్టమ్‌లో చేర్చారు.
ప్రయోజనం ఏంటి?
మంత్రి చెప్పిన దాని ప్రకారం.. ఈ మార్పుల వల్ల మంచి ఫలితం కనిపిస్తోంది. నిజమైన ప్రయాణికులు టికెట్లు పొందడం సులభం అవుతుంది. 96 ముఖ్యమైన రైళ్లలో 95 శాతం టిక్కెట్లు బుక్ అవడానికి పట్టే సమయం పెరిగింది. అంటే టికెట్లు ఎక్కువసేపు అందుబాటులో ఉంటున్నాయి. తత్కాల్ టికెటింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




