భారతదేశం 2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మంగళవారం తెలిపారు. 2024-25 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని గతంలో ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కోవిడ్ ప్రభావం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని నిపుణులు అంగీకరించారు. అయితే వేగంగా కోలుకోవడంతో ఈ లక్ష్యాన్ని చేరుకుకోవడం ఎంతో దూరంలో లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు అంచనా వేశారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో నాగేశ్వరన్ ప్రసంగిస్తూ, ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ప్రస్తుతం మనం $ 3.3 ట్రిలియన్ల స్థాయిలో ఉన్నామమని.. ఇది మన అసాధ్యమైన లక్ష్యం కాదన్నారు. డాలర్ పరంగా 10 శాతం GDP వృద్ధిని సాధిస్తే, 2033-34 నాటికి లక్ష్యాన్ని అధికమించ్చొచ్చని వివరించారు.
2019లో 2024-25 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధనంలో స్వావలంబన కావడానికి, గ్రీన్ ఎనర్జీకి మారడానికి అవసరమైన లోహాలు, ఖనిజాల సరైన సరఫరాను పొందడానికి భారతదేశం పెట్టుబడులు పెట్టాలని నాగేశ్వరన్ అన్నారు. మొదట కరోనా, తరువాత ద్రవ్యోల్బణం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోన్నాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించాయి. అయినప్పటికీ దీని తర్వాత కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని నాగేశ్వరన్ అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంక్ 7.5 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత ఆర్థిక వ్యవస్థ 8.7 శాతం వృద్ధి చెందింది.