Stock Market: ఇది కదా కావాల్సింది.. భారత్-అమెరికా డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..
ఇక కుదరదు అనుకున్న డీల్, అలా కుదిరిపోయింది. మొండిఘటంలా కనిపించిన ట్రంప్, తానే దిగివచ్చారు. భారత్‌పై సుంకాలు బాదేసి, సంబరపడిన పెద్దాయన, అనర్థాన్ని గ్రహించి, దారికొచ్చారు. భారత్-అమెరికా బిగ్ అనౌన్స్‌మెంట్ తర్వాత.. స్టాక్‌మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాలతో ప్రారంభయ్యాయి.. అంతేకాకుండా గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి.

వాణిజ్యరంగంలో మోదీ సర్కార్‌కు అతిపెద్ద విజయం దక్కింది. వారం రోజుల్లో రెండు చరిత్రాత్మక డీల్స్ కుదుర్చుకుంది భారత్. గతవారం యూరోపియన్ యూనియన్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌పై భారత్ సంతకాలు చేసింది. EU డీల్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగివచ్చారు… భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి ఆయనే ముందుకొచ్చారు. భారత్‌పై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది అమెరికా… 2 విడతలుగా విధించిన చెరో 25 శాతం ప్రతీకార సుంకాల్లో కీలకమార్పులు చేసింది. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై విధించిన 25 శాతం సుంకం ఎత్తేసింది అమెరికా. మరో విడతలో 25 శాతం సుంకాన్ని 18 శాతానికి పరిమితం చేసింది… అమెరికా సుంకాలు భారీగా తగ్గడంతో భారత ఎగుమతులకు మళ్లీ గిరాకీ మొదలవుతుంది. అయితే భారత్ కూడా తమ వస్తువులపై సుంకాలను తొలగిస్తుందని ట్రంప్ తన పోస్ట్‌లో చెప్పుకున్నారు. ఇందులో భాగంగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గును భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ వివరించారు. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటనను స్వాగతించారు ప్రధాని మోదీ.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలను తొలగిస్తుందన్న ట్రంప్ ప్రకటనపై మోదీ స్పందించలేదు. 140 కోట్లమంది భారతీయుల తరపున ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు మోదీ.. రెండుపెద్ద ఆర్థికవ్యవస్థలు, రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి పనిచేస్తే అపారమైన అవకాశాలతో పరస్పర ప్రయోజనాలు కలుగుతాయన్నారు మోదీ.
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో మార్కెట్లలో జోష్
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత స్టాక్‌మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బుల్స్ జోరు కనిపించింది. 2300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ సూచీ ట్రేడవుతోంది. 700 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతోంది. భారత్‌తోపాటు ఆసియా దేశాల మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి..
ఈ డీల్ ప్రభావంతో భారీగా బలపడింది రూపాయి విలువ. డాలర్‌తో పోల్చితే 1.2 శాతం బలపడింది భారత కరెన్సీ. 90 రూపాయల 40 పైసల దగ్గర డాలర్ మారకం ట్రేడవుతోంది. అంతేకాకుండా.. బంగారం, వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి.. దీంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
