Indian Railways: దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్ ఫిక్స్.. ఫుల్ డీటైల్స్ ఇవే..

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో మరో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. తొలుత అహ్మదాబాద్-ముంబై మార్గంలో తొలి ప్రాజెక్ట్ పూర్తి చేయనుండగా.. ఆ తర్వాత సిలిగురి-ఢిల్లీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రైల్వేమంత్రి ప్రకటించారు.

Indian Railways: దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్ ఫిక్స్.. ఫుల్ డీటైల్స్ ఇవే..
Bullet Train

Updated on: Jun 06, 2026 | 5:45 PM

దేశంలో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. దేశంలో మరో బుల్లెట్ రైలు కారిడార్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కీలక ప్రకటన చేశారు. సిలిగురిని ఢిల్లీలో అనుసంధానం చేసేందుకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. శనివారం కోల్‌కత్తాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును ప్రకటించారు.

తగ్గనున్న ప్రయాణం సమయం

సిలిగిరి-ఢిల్లీ హైస్పీడ్ రైలు కారిడార్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 20 గంటల సమయం పడుతుంది. అయితే బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ వల్ల 6 గంటలకు తగ్గనుంది. వచ్చే ఏడాదిలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అనంతరం రెండో ప్రాజెక్టుగా సిలిగిరి-ఢిల్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లక్నో, వారణాసి, పాట్నాల మీదుగా వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ,సిలిగురిని కలుపుతుందని తెలిపారు. దీని వల్ల బెంగాల్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగువుతాయని అన్నారు. రాబోయే ఐదేళ్లలో కోల్‌కతా మెట్రోకు 60 కొత్త తరం రైళ్లు రానున్నాయని తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద బెంగాల్‌లోని 102 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో రైల్వేల పూర్తి యాజమాన్యం, నిర్వహణలో ఉన్న ఏకైక వేగవంతమైన రవాణా వ్యవస్థ కోల్‌కతా మెట్రో అని అన్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం రూ. 1 లక్ష కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా కోల్ కత్తా మెట్రోలో కేంద్రమంత్రి పర్యటించారు.

వచ్చే ఏడాదిలో తొలి ట్రైన్

వచ్చే ఏడాదిలో దేశంలో తొలి బుల్లెట్  ట్రైన్ రానుంది. 2027  ఆగస్టు 15న ప్రారంభించాలని కేంద్రం చూస్తోంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో తొలి రైలు ప్రారంభం కానుంది. ఆ తర్వాత సిలిగురి-ఢిల్లీ కారిడార్ పనులు వేగవంతం చేయనున్నారు. ఇక చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె  బుల్లెట్ ప్రాజెక్ట్ పనులు కూడా చేపట్టనున్నారు. ఇప్పటికే  ఈ కారిడార్లకు సంబంధించి అలైన్‌మెంట్ సర్వే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భూసేకరణ పనులు చేపట్టనున్నారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేశాఖ సంప్రదింపులు జరుపుతోంది.

 

Follow Us