
చాలా మంది బ్యాంక్ ఖాతాదారులు, వారి నామినీలు లేదా వారసులకు నాన్-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాలు, అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించిన సమాచారం లేదు. ఒక కస్టమర్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ.. పొదుపు లేదా కరెంట్ ఖాతా నుండి రెండేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు చేయనప్పుడు, ఆ ఖాతా పనిచేయదు. అంటే ఇన్ ఆపరేటివ్ గా మారిపోతుంది. మీరు ఈ ఖాతా నుండి ఎలాంటి లావాదేవీలు చేయలేరు. అదే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ అయిన 2 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయకపోతే, అది కూడా పనికిరాకుండా పోతుంది లేదా నిష్క్రియం అవుతుంది. ఈ ఖాతాలు 10 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉంటే, వాటిలోని మిగిలిన మొత్తం రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి బదిలీ అవుతుంది.
అటువంటి బ్యాంకు ఖాతాలు వాటిలోని బ్యాలెన్స్‌ను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా సహాయపడటానికి ప్రభుత్వం గత సంవత్సరం ఉద్గం (Unclaimed Deposits – Gateway to Access inforMation) ను ప్రారంభించింది. కానీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు బ్యాంకుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీనివల్ల అటువంటి నాన్-ఆపరేటివ్ ఖాతాలతో పాటు, వాటిలో క్లెయిమ్ చేయని ఖాతాల పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రజలు క్లెయిమ్ చేయడం సులభం అవుతుంది. మోసం జరిగే ప్రమాదం తగ్గుతుంది.
బ్యాంకులు డబ్బు నిలిచిపోయిన ఖాతాలన్నింటినీ.. పనికిరాని ఖాతాలుగా వర్గీకరించి, వాటిని ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పేర్కొంది. అందుకే వీటికి కొత్త మార్గదర్శకాలను జారీ చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఖాతాలన్నీ కొత్త నిబంధనల ప్రకారం మళ్లీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఖాతాలన్నీ 6 నెలల పాటు యాక్టివేట్‌గా ఉంటాయి. తరువాత ఖాతాదారులను గుర్తించనున్నారు. 6 నెలల తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, అవి క్లోజ్ అయిపోతాయి. వారి డబ్బు DEAFకి బదిలీ అవుతుంది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి.
ఏడాదికి మించి లావాదేవీలు జరగని ఖాతాలను ఏటా సమీక్షించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ కోరింది. అంతేకాకుండా, పునరుద్ధరణకు సంబంధించి స్పష్టమైన ఆదేశం ఇవ్వని, మెచ్యూరిటీ తర్వాత కూడా డబ్బు విత్‌డ్రా చేయని టర్మ్ డిపాజిట్‌లను అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను సమీక్షించాలని కూడా కోరింది. ఆపరేటివ్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు బ్యాంకులు జరిమానా విధించడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆపేసింది. సో.. ఇప్పుడు పనిచేయని ఖాతాను యాక్టివేట్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.
కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ ఖాతా డిపాజిట్ హోల్డర్‌లకు లేఖ, ఈమెయిల్ లేదా వారి రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌లో గత ఏడాది కాలంగా తమ ఖాతాలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదని తెలియజేయాలి. దీనితో పాటు వచ్చే ఏడాది పొడిగించిన వ్యవధిలో కూడా కార్యాచరణ లేకపోతే, ఆ ఖాతాలు పనిచేయని ఖాతాలుగా మారుతాయని హెచ్చరిస్తారు.
దీని తర్వాత కూడా ఖాతాదారు అప్రమత్తం కాకపోతే.. బ్యాంకులు ఖాతాదారుని లేదా అతని నామినీ/వారసుడిని ట్రేస్ చేయవలసి ఉంటుంది. KYCని అప్‌డేట్ చేసిన తర్వాత ఇన్ ఆపరేటివ్ ఖాతాలను కూడా మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు.
ఇది కాకుండా, మోసం జరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి, బ్యాంకులు అటువంటి పని చేయని ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించవలసి ఉంటుంది. ఖాతాదారుడు స్వయంగా ఖాతాను యాక్టివేట్ చేస్తే తప్ప… ఇప్పుడు బ్యాంకులు ఇన్ ఆపరేటివ్ ఖాతాలో ఎలాంటి డెబిట్ లావాదేవీని అనుమతించవు. డేటా చౌర్యం, దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకులు కూడా హామీ ఇస్తాయి.
అలాగే, DEAFకి బదిలీ అయిన అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించిన వివరాలను బ్యాంకులు ప్రతి నెలా తమ సైట్‌లు లేదా బ్రాంచ్‌లలో ప్రదర్శించాలి. అదే సమయంలో, బ్యాంకులు పనిచేయని ఖాతాలు/క్లెయిమ్ చేయని డిపాజిట్ల యాక్టివేషన్ ప్రక్రియ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి అనే సమాచారాన్ని కూడా అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి