LIC Death Insurance: LIC పాలసీ దారుడు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి. తెలియకపోతే ఇది ఒక పెద్ద టాస్క్ లాంటిది. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు పాలసీ జారీ చేసిన హోమ్ శాఖను సంప్రదించాలి. ఆ బ్యాంచ్‌కి వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్‌మెంట్ ఆఫీసర్ సంతకాన్ని తీసుకోవాలి.
LIC ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేయాలి..?
1. ఇన్సూరెన్స్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు నామినీ.. పాలసీ జారీ చేసిన LIC హోమ్ శాఖను సంప్రదించాలి. అక్కడ పాలసీదారుడి మరణం గురించి సమాచారం ఇవ్వాలి. నామినీ బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి ఫారం 3783, ఫారం 3801, NEFT పూరించాలి.
2. ఈ ఫారమ్‌లతో పాటు ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ లేదా పాస్‌పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఐడి ప్రూఫ్ జతచేయాలి.
3. పూర్తిగా నింపిన ఫారం, డాక్యుమెంట్‌లతో పాటు నామినీ డిక్లరేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణాన్ని పేర్కొనవలసి ఉంటుంది.
4. NEFT ఫారంతో పాటు, నామినీ క్యాన్సిల్ చేసిన చెక్కు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ ( బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నంబర్, IFS కోడ్‌తో ముద్రించి ఉండాలి) సమర్పించాలి.
5. డెత్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి, డాక్యుమెంట్‌లను ఆమోదించడానికి ముందు ఎల్ఐసి ఆఫీసర్ ఒరిజినల్ పాస్‌బుక్‌ను ధృవీకరిస్తారు. నామినీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు క్రెడిట్ కావడానికి ముందు ఎల్‌ఐసీ అవసరమైతే అదనపు డాక్యుమెంట్‌లను కూడా అడిగే అవకాశం ఉంది.
6. డాక్యుమెంట్లను LIC శాఖకు సమర్పించిన తర్వాత రసీదు తీసుకొని దానిని సురక్షితంగా కాపాడాలి. అదనపు పత్రాలు అవసరం లేకపోతే నామినీ ఒక నెల వ్యవధిలో సెటిల్మెంట్ మొత్తాన్ని పొందుతారు. అయితే ఒక నెలలోపు మీ బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు జమ కాకపోతే మీరు రసీదుని తీసుకొని LIC బ్రాంచ్‌కు వెళ్లి స్టేటస్ కోసం అడగాల్సి ఉంటుంది.