ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ లోన్ లపై ఆధారపడుతున్నారు. కేవలం నెలవారీ సంపాదనతోనే మనకు అన్నీ సమకూరాలంటే చాలా కష్టం. ఇల్లు కట్టుకోవాలన్నా.. ఉన్న ఇల్లు రీ మోడల్ చేయించుకోవాలన్నా హోమ్ లోన్.. కారు కొనుక్కోవాలంటే కార్ లోన్.. మరేదైనా అత్యవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ లోన్లు ఇచ్చే బ్యాంకులు ఒక్కో లోన్ కి ఒక్కో రకమైన వడ్డీ రేటు విధిస్తాయి. అది కూడా బ్యాంక్ ను బట్టి మారుతుంటాయి. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికీ వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మన పరిధి మేరకు అతి తక్కువ వడ్డీతో సులభంగా లోన్ పొందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మీరు ఇలానే కోరుకుంటున్నారా? సులభంగా అతి తక్కువ వడ్డీతో ఎవరైనా లోన్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసం ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ స్టోరీని చదివేయండి..
ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని, అతనికి ఉన్న అప్పులు, వాటిని తిరిగి చెల్లించే విధానాన్ని క్రెడిట్ స్కోర్ తెలియజేస్తుంది. అందుకే బ్యాంకర్లు ఈ క్రెడిట్ స్కోర్ ను ఆధారంగా చేసుకొని లోన్లు మంజూరు చేస్తుంటాయి. ఈ క్రెడిట్ స్కోర్ కనీసం 700 నుంచి 750 ఉంటే మీకు కావాల్సిన లోన్ సులభంగా అందుతుంది. 750 కన్నా ఎక్కువ ఉంటే బ్యాంకర్లే మీకు ఫోన్ చేసి లోన్ తీసుకోండి అని చెబుతారు. అది కూడా అతి తక్కువ వడ్డీకే మంజూరు చేస్తారు. ఒకవేళ మీకు ఈ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే.. లోన్ తీసుకోకపోవడమే ఉత్తమం. అలాకాకుండా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకులు ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు. లేదా అత్యధిక వడ్డీని విధించవచ్చు. వీలైనంత వరకూ క్రెడిట్ స్కోర్ పెంచుకున్న తర్వాతనే లోన్ కోసం వెళ్లడం ఉత్తమం.
మంచి సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు ఫైనాన్షియర్స్ మంచి ఆఫర్లు ప్రకటిస్తాయి. తమ వద్ద లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువని.. ప్రాసెసింగ్ ఫీజు ఉండదంటూ పలు ఆఫర్లు అందిస్తాయి. అలా ఈ మెయిల్స్, మెసేజెస్ చేస్తుంటాయి. వాటిని బేరీజు వేసుకుని ఏది మంచిదైతే దానిని ఎంపిక చేసుకోవాలి.
మీకు ఇప్పటికే ఏదైనా లోన్ ఉంటే వాటి ఈఎంఐలు నిర్దేశిత గడువులోగా చెల్లించాలి. లేదా క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఉంటే డ్యూ డేట్ లోపు చెల్లించాలి. లేకుంటే బ్యాంకర్లు వాటిపై అధికంగా పెనాల్టీలు, లేట్ పేమెంట్ చార్జీలు విధిస్తాయి. అలాగే ఈ లేట్ పేమెంట్స్ మీ క్రెడిట్ స్కోర్ పై అధిక ప్రభావాన్ని చూపుతాయి.
మీకు ఓ బ్యాంకు లోన్ ఆఫర్ చేయగానే వెంటనే తీసేసుకోకుండా.. ఇతర బ్యాంకులతో ఈ బ్యాంకు ఇచ్చే మొత్తం.. వడ్డీ రేట్లు, మినహాయింపులు, చార్జీలు వంటివి కంపేర్ చేసుకోవాలి. తద్వారా వాటిలో మనకు అనువైన బ్యాంకును ఎంపిక చేసుకుని లాభపడొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..