
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి, వ్యవసాయ రంగంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏమిటి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998 లో ప్రారంభించారు. రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను అందించడం దీని లక్ష్యం. తద్వారా వారు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర అవసరాలకు సులభంగా నిధులను పొందవచ్చు. మార్చి-ఏప్రిల్ 2024 నాటికి ఈ పథకం కింద 7.75 కోట్ల యాక్టివ్ ఖాతాలు ఉన్నాయి. అలాగే మొత్తం రూ.9.81 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. దీన్ని బట్టి ఈ పథకం రైతులకు ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది.
బడ్జెట్ 2025 లో కేసీసీ పథకంలో ఏ మార్పులు:
ఈ సంవత్సరం బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు. ఈ మార్పు రైతులకు మరింత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. డిజిటల్ ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది?
కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN), అంతర్జాతీయ గుర్తింపు సంఖ్య (IIN) ఉంటాయి. ఇది మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులా పనిచేస్తుంది. ఇప్పుడు రైతులు ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం నుండి సులభంగా డబ్బు తీసుకోవచ్చు. తద్వారా అవసరమైన సమయంలో క్రెడిట్ సులభంగా లభిస్తుంది. సవరించిన వడ్డీ సబ్సిడీ కార్యక్రమం కింద రైతులు ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు .
2025 బడ్జెట్‌లో KCC పథకం పొడిగింపు:
ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం KCC పథకాన్ని 7.7 కోట్ల మంది రైతులకు విస్తరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పశుపోషణ, చేపల పెంపకంలో పాల్గొన్న రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకానికి సంబంధించిన కొత్త ప్రయోజనాలు:
2025 బడ్జెట్ ప్రకారం.. ప్రభుత్వం అదనంగా 1 కోటి మంది రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇది ఇప్పటివరకు రుణాలు, ఆర్థిక సహాయం పొందని రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డుపై సబ్సిడీ అందుబాటులో..
కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రూ.3 లక్షల వరకు రుణాలపై రాయితీ వడ్డీ రేటు 7%. ఒక రైతు సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే, అతనికి 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఇది తుది వడ్డీ రేటును 4%కి తగ్గిస్తుంది. అయితే రూ.3 లక్షల కంటే ఎక్కువ రుణాలకు, వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అందుకే రైతులు తమ సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: PM Kisan: సమయం వచ్చేస్తోంది.. విడుదల కానున్న పీఎం కిసాన్ 19వ విడత!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి