IndiGo: వారికి రూ. 10 వేల వోచర్లు.. ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్.. ఏడాదిలో ఎప్పుడైనా..
విమానాల రద్దుతో నష్టపోయిన ప్రయాణికులకు వోచర్లు ఇస్తామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరోవైపు, ఇండిగో విమానాల రాకపోకలపై DGCAకి నివేదిక ఇచ్చారు పీటర్ ఎల్బర్స్. అయితే, ఇవాళ కూడా విచారణకు రావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది DGCA. ఆ వివరాలు ఇలా..

విమానాల రద్దుతో అవస్థల పాలవుతున్న ప్రయాణికుల కోసం ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. విమానాలు రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోయిన ప్రయాణికులకు వోచర్లు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.10 వేల వోచర్లు ఇస్తామని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ఏడాదిపాటు ఎప్పుడైనా ఈ వోచర్స్ ఉపయోగించుకోవచ్చు. గత 10 రోజులుగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇవాళ కూడా 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇవాళ 1950 విమానాలు నడుస్తునట్టు ఇండిగో సంస్థ తెలిపింది. మరోవైపు DGCA విచారణకు ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. ఇండిగో విమానాల రాకపోకలపై పీటర్ ఎల్బర్స్ నివేదిక ఇచ్చారు. ఇండిగో యాజమాన్యానికి DGCA పలు ప్రశ్నలు సంధించింది. ప్రయాణికులకు రీఫండ్ , క్రూ మేనేజ్‌మెంట్ , లగేజ్ అప్పగింతకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకున్నారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని DGCA ఇండిగో అధికారులను ఆదేశించింది. 10 రోజులైనప్పటికి ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. గురువారం బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచే 60 విమానాలు రద్దయ్యాయి.
ప్రతిరోజు 2200 విమానాలను ఇండిగో సంస్థ ఆపరేట్ చేస్తోంది. అయితే సంక్షోభం తరువాత 10 శాతం విమానాలపై కోత విధించింది ప్రభుత్వం. గత మూడు రోజుల నుంచి పరిస్థితి మెరుగవుతోందని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన ఇండిగో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అయితే కేంద్రం తీరు తోనే ప్రయాణికులకు ఇబ్బందులు వచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. ప్రయాణికులకు రీఫండ్‌పై DGCA ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా 3 నుంచి 5 తేదీల వరకు ఇబ్బందుల పడ్డ వాళ్లకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.




