2022 సంవత్సరం ముగియబోతోంది. ఇక 2023 ఏడాది రాబోతోంది. జనవరి 1 నుంచి పలు అంశాలలో నిబంధనలు మారనున్నాయి. ముందస్తుగా గుర్తించి మారుతున్న నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జనవరి 1, 2023 నుండి ఆరోగ్యం, మోటార్, ప్రయాణ, గృహ బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి పలు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. కేవైసీ డాక్యుమెంట్‌లు తప్పనిసరి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) జనవరి 1 నుండి అన్ని కొత్త బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి కేవైసీ నియమాలను తప్పనిసరి చేసింది. ఇందులో ప్రీమియం మొత్తం ఏదైనా కావచ్చు. ఈ నియమం అన్ని రకాల బీమాలకు వర్తిస్తుంది. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమాలకు ఈ నియమాలు వర్తించనున్నాయి.
ప్రస్తుతం, ఆరోగ్య బీమా, వాహన బీమా మరియు ప్రయాణ బీమా పాలసీల వంటి జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి KYC పత్రాలు తప్పనిసరి కాదు. ప్రస్తుతం, మీరు ఆరోగ్య బీమా పాలసీలో మాత్రమే క్లెయిమ్ చేసినప్పుడు, ముఖ్యంగా క్లెయిమ్ విలువ లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, కస్టమర్ పాన్ కార్డ్ మరియు ఆధార్‌ను సమర్పించాలి. కొత్త ప్రక్రియ ప్రకారం, ఇప్పుడు క్లెయిమ్ సమయంలో కాకుండా, పాలసీని కొనుగోలు చేసే సమయంలో మీకు KYC అవసరం.
కొత్త సాధారణ బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ కేవైసీ పత్రాలను పంచుకోవడం ఇప్పటి వరకు ఐచ్ఛికం. జనవరి 1 నుండి ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా కొత్త జీవితేతర బీమా పాలసీలపై కస్టమర్‌ల నుండి బీమా కంపెనీలు కేవైసీ పత్రాలను పొందడం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న కస్టమర్‌ల కోసం నిర్ధిష్ట వ్యవధిలోపు కేవైసీ డాక్యుమెంట్‌లను సేకరించాలని రెగ్యులేటర్ బీమా సంస్థలను కోరింది. ఈ కాలపరిమితి తక్కువ రిస్క్ పాలసీదారులకు రెండేళ్లు, అధిక రిస్క్ కస్టమర్లకు ఒక సంవత్సరం ఉంటుంది. కేవైసీ వివరాలను సకాలంలో సమర్పించమని బీమా కంపెనీలు ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా కస్టమర్‌లకు తెలియజేస్తాయి.
ప్రస్తుతం ఉన్న కస్టమర్‌లు తమ పాలసీలను పునరుద్ధరించుకోవడానికి కేవైసీ పత్రాలను సమర్పించడం తప్పనిసరి కాదని గమనించండి. అయితే, మీ పాలసీ జనవరి 1, 2023 తర్వాత పునరుద్ధరణకు గడువు ఉంటే కేవైసీ కోసం ఫోటో ID, చిరునామా రుజువును సమర్పించమని బీమా కంపెనీ మిమ్మల్ని కోరవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఇప్పటికే పాలసీని కలిగి ఉంటే మీరు బీమా కంపెనీకి కేవైసీ వివరాలను ఇవ్వకపోతే, మీరు వీలైనంత త్వరగా బీమా కంపెనీకి అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి