పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. నగరాలతో పాటు ఓ మాదిరి టౌన్లలో కూడా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. బ్యాంకుల ద్వారా నెలవారీ వాయిదాలు చెల్లించేలా వీటిలో ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరానికి వలస వచ్చిన వారందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ఆదాయం, అర్హతలు ఉన్న వారందరూ సులభ వాయిదాల పద్ధతులతో వీటిని తీసుకుంటారు. రుణం చెల్లించడానికి దాదాపు 20 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రతి నెలా కట్టే ఈఎంఐలో మీ రుణం, దానికి వడ్డీ కలిపే ఉంటుంది. అయితే మీరు తీసుకున్న హోమ్ లోన్ తీరిపోయిన తర్వాత ఆ విషయాన్ని వదిలేకూడదు. సంబంధిత బ్యాంకుల నుంచి కొన్ని ప్రతాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లాట్ కు సంబంధించిన పూర్తి హక్కులు మీకు లభిస్తాయి. హోమ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత మీరు తప్పనిసరిగా చేయాల్సిన ఐదు పనుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టుగా ఉంచుతారు. లోన్ పూర్తయిన తర్వాత వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఒరిజినల్ డ్యాక్యుమెంట్లు తీసుకోవడం మర్చిపోకూడదు. వీటిలో కేటాయింపు లేఖ, స్వాధీనం లేఖ, సేల్ డీడ్, బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందం, ఇతర చట్టపరమైన పత్రాలు ఉంటాయి.
గృహ రుణం తీసుకున్నవారికి ఆ ఆస్తిపై బ్యాంకు తాత్కాలిక హక్కును ఇస్తుంది. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విఫలమైతే ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. మీరు రుణాన్ని చెల్లించిన తర్వాత తాత్కాలిక హక్కు అధికారికంగా తీస్తారు. మీకు పూర్తి హక్కు కలుగుతుంది.
హోమ్ లోన్ ను తిరిగి చెల్లించిన తర్వాత నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందాలి. మీకు రుణమిచ్చిన బ్యాంక్, ఆర్థిక సంస్థ దీన్ని జారీ చేస్తాయి. మీరు రుణం పూర్తిగా చెల్లించారని చెప్పడానికి ఇది రుజువు. దీనిలో రుణగ్రహీత పేరు, ఆస్తి చిరునామా, లోన్ ఖాతా నంబర్, లోన్ మొత్తం, ప్రారంభ తేదీ, చెల్లింపు పూర్తయిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఈ సర్టిఫికెట్ లేకపోతే మీ ఆస్తి పై ఇంకా రుణం ఉన్నట్టే భావిస్తారు.
ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు, గత విక్రయాలు, రుణాలను వివరించే చట్టపరమైన పత్రాన్నే నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఎన్ ఈసీ) అంటారు. మీరు భవిష్యత్తులో మీ ఆస్తిని విక్రయించాలని నిర్ణయించుకుంటే ఇది తప్పనిసరిగా అవసరమవుతుంది. ఈ సర్టిఫికెట్ల ఉంటేనే మీ ఆస్తిని వేరేవాళ్లు కొనుగోలు చేస్తారు.
రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే క్రెడిట్ స్కోర్ మరింత మెరుగవుతుంది. మీకు భవిష్యత్తులో రుణాలను సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..