సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం చిరకాల కోరిక. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు అయితే అద్దె ఇళ్ల భారం నుంచి తప్పించుకోవడానికి గృహ రుణం తీసుకుని మరీ సొంత ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రాపర్టీ ఖర్చులతో, గృహ రుణాల రేట్లు పెరగడంతో సరసమైన వడ్డీ రేట్లకు కావాల్సిన గృహ రుణ మొత్తాన్ని పొందడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మంచి ఇల్లు కొనుగోలు చేయాలని ఆశతో మీ అంచనాకు మించి గృహ రుణం తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గృహ రుణం కోసం గరిష్ట పరిమితి కంటే ఎక్కువ రుణం తీసుకోవడం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు అధిక రుణ మొత్తాన్ని ఎక్కువ వడ్డీ రేటుతో అందిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే జీవితాంతం రుణభారంతో ఇబ్బంది పడాలి. ఈ నేపథ్యంలో గృహ రుణం పొందే సమయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? అనే విషయాలును ఓ సారి తెలుసుకుందాం.
మీరు గృహ రుణం పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయాలి. మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించిన ఏవైనా రుణాలు ఉంటే వాటిని తనిఖీ చేయాలి. మీ క్రెడిట్ స్కోర్ 750 దాటి ఉంటే తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకులు రుణాలు అందిస్తాయి. అయితే మీరు ఇప్పటికే వివిధ రకాల రుణాలు తీసుకుని ఉంటే వీలైనంత త్వరగా రుణాలు తిరిగి చెల్లించి క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందడం సులభం అవుతుంది.
రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? డౌన్ పేమెంట్ చేయడానికి మీ దగ్గర తగినంత డబ్బు ఉందా? మీరు లోన్ కోసం అప్లై చేసే ముందు ఆస్తి విలువలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ చెల్లించడానికి అవసరమైన ఫైనాన్స్ మీకు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా లోన్లు అందించే బ్యాంకులు మీకు అనుకూలమైన వడ్డీ రేట్లలో రుణం అందించే అవకాశం ఉంది. చాలా మందికి డౌన్ పేమెంట్ చేయడానికి అవసరమైన పొదుపు ఉండదు. అలాంటి వారు సొమ్మును సమకూర్చుకుని బ్యాంకులను సంప్రదిస్తే మేలు.
గృహ రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులను సంప్రదించి వారు ఎంత మేర వడ్డీ విధిస్తున్నారో? తెలుసుకోవడం ఉత్తమం. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు, ఫీజులను అంచనా వేయడానికి వారి నుండి కోట్‌లను పొందండి.
రుణం పొందడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవడం లోన్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. పే స్లిప్‌లు, గత రెండు నుంచి మూడు సంవత్సరాలలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు వంటి వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే మీ ప్రస్తుత నివాసానికి సంబంధించిన యుటిలిటీ బిల్లులు, అద్దె ఒప్పందాలు లేదా తనఖా స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..