కరోనా నివారణలో ఉపయోగించే వైద్య ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కోవిడ్ కట్టడికి కావాల్సిన వైద్య ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం జరగనున్న సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పలు నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆక్సిజన్‌తో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,జనరేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్, కరోనా టెస్టింగ్ కిట్స్‌కు మాత్రం పన్ను ఊరట లభించే అవకాశముంది.
వీటిపై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ సిఫార్స్ చేసింది. అయితే.. ఎన్-95 మాస్క్‌లు, పీపీఈ కిట్స్, శానిటైజర్స్, వ్యాక్సీన్స్, ఆర్టీపీసీఆర్ యంత్రాలు, వెంటిలెటర్లకు మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చేట్లు కనిపించడం లేదు. వ్యాక్సీన్లపై ఇప్పటికే కనిష్టంగా పన్ను తగ్గింపు అందుతోంది.
ఇదిలా ఉంటే టెస్టింగ్ కిట్స్ మినహా మిగతా వాటిపై కొత్త రేట్లు జూలై 31 నుండి అమల్లోకి రానున్నాయి. కిట్స్ పైన మాత్రం ఆగస్ట్ 31వ తేదీ నుండి వర్తించనుందని తెలుస్తోంది. వెంటిలెటర్ల పైన 12 శాతం, హ్యాండ్ శానిటైజర్లు, ఆర్టీ-పీసీఆర్ మెషీన్లు, ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ మెషీన్లు, టెంపరేచర్ చెక్ పరికరాలపై 18 శాతం చొప్పున జీఎస్టీ విధిస్తున్నారు. అంబులెన్స్ సర్వీసులపై 28 శాతం, పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్లపై 18 శాతం జీఎస్టీ ఉంది.