కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం! ఆటో బాబుల సంబరాలు
ఈ-రిక్షాలను బ్లూటూత్ ద్వారా రిమోట్‌గా నిలిపివేస్తున్న మూడు యాప్‌లను ప్లే స్టోర్‌ల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. BAT-BMS, Lossigy, Epoch-i-ion యాప్‌లు బ్యాటరీ భద్రతా లోపాలను దుర్వినియోగం చేస్తున్నాయి. దీంతో ఈ-రిక్షా డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆటోవాలాలను ఇబ్బంది పెడుతున్న మూడు యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలను బ్లూటూత్ ద్వారా రిమోట్‌గా నిలిపివేయడానికి దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ తరహా కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న BAT-BMS, Lossigy, Epoch-i-ion అనే మూడు స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
శుక్రవారం నిర్వహించిన సీఐఐ సైబర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు యాప్‌లను యాప్ స్టోర్‌ల నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ప్రభుత్వ వర్గాలు మొత్తం మూడు యాప్‌లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు వీడియోల్లో, కొందరు వ్యక్తులు బ్లూటూత్ ద్వారా ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS)కు కనెక్ట్ అయి, వాహనాలను రిమోట్‌గా ఆపేస్తున్నట్లు కనిపించింది. దీంతో ఇంటర్నెట్‌కు లేదా వైర్‌లెస్ కనెక్టివిటీకి అనుసంధానమైన వాహన వ్యవస్థల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనల నేపథ్యంలో యాప్ స్టోర్‌లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో యాప్‌లను అనుమతించే ముందు మరింత కఠినమైన భద్రతా తనిఖీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. హానికరంగా మారే అవకాశం ఉన్న యాప్‌లు ప్రజలకు అందుబాటులోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. BAT-BMS యాప్ పనితీరుపై, అలాగే బ్లూటూత్ ద్వారా ఈ-రిక్షాలను రిమోట్‌గా నిలిపివేయగలదన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించింది. అధికారిక ఫిర్యాదు అందకపోయినా, సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలన ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు.
ప్రభుత్వ ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ యాప్‌లు సాధారణంగా బ్లూటూత్ ద్వారా లిథియం బ్యాటరీలకు కనెక్ట్ అయి వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను పర్యవేక్షించేందుకు రూపొందించారు. అయితే భద్రతా లోపాలు ఉన్న బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న కొన్ని ఈ-రిక్షాల్లో వీటిని దుర్వినియోగం చేసి బ్యాటరీ డిశ్చార్జ్ ఫంక్షన్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మన దేశంలో తక్కువ ధరలో లభించే అనేక ఈ-రిక్షాలు చైనాలో తయారైన, పాస్‌వర్డ్ రక్షణ లేదా సరైన ప్రామాణీకరణ లేని BMSలను ఉపయోగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా సమీపంలో ఉన్న ఎవరైనా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి బ్యాటరీ పవర్‌ను నిలిపివేయగల పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని వైరల్ వీడియోల్లో వాహనాలు రోడ్డుమధ్యలోనే ఒక్కసారిగా ఆగిపోవడం కనిపించింది. అంతేకాక, తమ వాహనాలను మళ్లీ ప్రారంభించేందుకు కొందరు అపరిచితులకు డబ్బు చెల్లించాల్సి వచ్చిందని ఈ-రిక్షా డ్రైవర్లు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సైబర్ భద్రతపై మరింత కఠినమైన ప్రమాణాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
To also block other apps being misused: Govt sources after crackdown on three apps used to remotely disable e-rickshaws. pic.twitter.com/PjT4wmBfO4
— Press Trust of India (@PTI_News) July 3, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
