Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మౌలిక వసతులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే కేంద్రం విక్రయించే జాబితాలో రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ సరఫరా లైన్లు, గ్యాస్ పైప్‌లైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించనున్నారు.
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, పన్ను ఆదాయంలో కరోనా మహమ్మారి సమయంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను భర్తీ చేయడానికి మార్చి 2022 వరకు ఈ విక్రయాలు జరపాలని భావిస్తోంది. అయితే మంత్రిత్వశాఖల ద్వారా మానిటైజింగ్ రోడ్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.1.6 లక్షల కోట్లుగా అంచనా ఉంది. అలాగే రైల్వేల నుంచి రూ.1.5 లక్షల కోట్లు, విద్యుత్ రంగ ఆస్తులు రూ.లక్ష కోట్లు, గ్యాస్‌పైప్‌లైన్‌లు రూ.59వేల కోట్లు, టెలికమ్యూనికేషన్ ఆస్తులు రూ.40 వేల కోట్ల వరకు పొందవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత ఏడాదికిపైగా కరోనా మహహ్మారి కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతోంది. మొదటి, రెండు దశల్లో ఆర్థికంగా బాగా కుంగిపోయింది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆర్థికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇలాంటి విక్రయాల వల్ల మరింత ఆదాయం పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.