AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: వామ్మో.. వచ్చే 5 ఏళ్లలో బంగారం ధర అంత పెరుగుతుందా..! ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..

బంగారం అంటే భారతీయులకు ఆదుకునే నిజమైన నేస్తం. ప్రస్తుతం బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులకు.. డాయిష్ బ్యాంక్ షాకింగ్ నివేదిక ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో బంగారం ధర ఏకంగా 80 శాతం పెరగబోతోందన్న అంచనాలు గుబులు రేపుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gold: వామ్మో.. వచ్చే 5 ఏళ్లలో బంగారం ధర అంత పెరుగుతుందా..! ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..
Deutsche Bank Gold Price Prediction Report 2026
Krishna S
|

Updated on: May 03, 2026 | 1:55 PM

Share

బంగారం.. భారతీయులకు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి. గత కొన్ని నెలలుగా ఒక నిర్దిష్ట పరిధిలోనే కదులుతున్న బంగారం ధరలు, త్వరలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జర్మనీకి చెందిన అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంక్ డాయిష్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది జనవరి వరకు ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టించిన బంగారం ధరలు, ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చెన్నై మార్కెట్‌లో 8 గ్రాములు బంగారం ధర రూ.1.20 లక్షల లోపే ఉంది. అయితే ఇది కేవలం తుఫాను ముందు వచ్చే నిశబ్దం మాత్రమేనని డాయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో బంగారం ధర ఏకంగా 80 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆ బ్యాంక్ విశ్లేషించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 4,600 డాలర్లుగా ఉంటే, అది ఐదేళ్లలో 8,000 డాలర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక సారాంశం. ఈ లెక్కన మన దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.15, 093 ఉండగా, అది భవిష్యత్తులో రూ. 25,000 వరకు వెళ్లవచ్చు. అంటే ఒక 8 గ్రాములు బంగారం ధర రూ. 2 లక్షల భారీ మైలురాయిని చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది.

ధరలు ఎందుకు పెరుగుతాయి?

కేంద్ర బ్యాంకుల బంగారు వేట

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 30శాతం నుండి 40శాతం వరకు నిల్వలను పెంచుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగి, ధరలకు రెక్కలు వస్తాయి.

డాలర్‌కు ప్రత్యామ్నాయంగా..

అమెరికా వంటి దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుండి రక్షణ పొందేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. అమెరికా డాలర్ నిల్వలను 60శాతం నుండి 40శాతంకి తగ్గించుకుని, ఆ నిధులతో సురక్షితమైన బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి.

కొత్త దేశాల మధ్య పోటీ

గతంలో కేవలం భారత్, చైనా, రష్యా, టర్కీలు మాత్రమే బంగారం కొనుగోళ్లలో ముందుండేవి. కానీ ఇప్పుడు కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు కూడా భారీ ఎత్తున బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభించాయి. ఈ కొత్త దేశాల పోటీ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కానుంది.

కాగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక మార్పుల దృష్ట్యా, బంగారం వైపు ప్రపంచం మొత్తం చూపు సారిస్తోంది. ఐదేళ్లలో బంగారం ధర 80శాతం పెరుగుతుందన్న అంచనాలు నిజమైతే, సామాన్యులకు పసిడి ఆభరణాలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. కానీ పెట్టుబడి కోణంలో చూసే వారికి మాత్రం ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది.

Follow Us