Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..

|

Feb 21, 2022 | 7:26 PM

గోల్డ్‌ బుల్‌ రన్‌ తీస్తోంది. తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. రోజుకు వందల్లో వారానికి వేలల్లో పెరిగింది గోల్డు. ఇప్పటికే ఆలస్యమైతే త్వరపడండి. అక్కడ యుద్ధం మొదలైతే.. పట్టలేని వేగంతో పరుగులు పెడుతుందీ పసిడి.

Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..
Gold Rate
Follow us on

అసలే పెళ్లిళ్ల సీజన్. ఆపై అంతర్జాతీయంగా భారీ డిమాండ్. దీంతో బంగారం ధరలకు(Gold Rate) రెక్కలొచ్చాయి. దేశంలో గొల్డ్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బంగారం ధరలు బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. గోల్డ్‌ బుల్‌ రన్‌ తీస్తోంది. తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. రోజుకు వందల్లో వారానికి వేలల్లో పెరిగింది గోల్డు. ఇప్పటికే ఆలస్యమైతే త్వరపడండి. అక్కడ యుద్ధం మొదలైతే.. పట్టలేని వేగంతో పరుగులు పెడుతుందీ పసిడి. పదిలక్షలు పెట్టి చీర కట్టినా.. పదివేలు పెట్టి సన్నని బంగారు చైన్‌ వేస్తేనే దానికా అందం వస్తుంది. టాప్‌ టు బాటమ్‌ ఖద్దరు ధరించినా.. చేతికి రెండు ఉంగరాలుంటే ఆ లుక్కే వేరు. ఇంట్లో ఎన్ని వస్తువులున్నా.. బీరువాలో రెండు బంగారు బిస్కె్ట్లుంటే ఆ తృప్తి(satisfaction) చెప్పలేనంతగా ఉంటుంది. భారత దేశంలో బంగారం అంటే ఆభరణం కాదు. అదో ఎమోషన్‌. వర్ణించలేని అనుభూతి. అలాంటి బంగారాన్ని కొనాలన్న ఆశ అందరికీ ఉంటుంది. మహిళలు దీన్ని ఆభరణం కింద చూస్తే.. మగవారు ఆస్తిలా భావిస్తారు. అందుకే ఒకరు నగలు, ఇంకొకరు బిస్కెట్ల రూపంలో కొంటుంటారు.

ఎన్నడూ లేనంతగా..

మన దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం కొనుగోల్లు పెరిగిపోతున్నాయి. గత 20 ఏళ్లుగా దేశంలో వేలాది టన్నులకొద్దీ బంగారం అమ్ముడుపోయింది. ఇంకా అమ్ముడు పోతొంది కూడా. ప్రజల్లో బంగారంపై పెరిగిన అవగాహన వల్ల డిమాండ్‌ కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. గోల్డ్‌ని రకరకాల రూపాల్లో కొంటూ తమ ఆస్తులను పెంచుకుంటున్నారు భారతీయులు. క్రైసిస్‌లో అదే తమను కాపాడుతుందన్న ధీమాతో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడడంలేదు. అందుకే బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు 10గ్రాముల 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర 50వేల పైనే ఉంది. రెండ్రోజుల క్రితం 51వేల మార్క్‌ని తాకింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 9వందలుగా ఉంది.

ముందు గోల్డ్‌ స్టాటిస్టిక్స్‌ని పరిశీలిస్తే..

2020లో కోవిడ్‌ మహమ్మారి విపరీతంగా ఉన్న దశలో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. దేశంలో కేవలం 446 టన్నుల బంగారమే అమ్ముడుపోయింది. కాని 2021లో ఈ గణాంకాలు ఏకంగా రెట్టింపయ్యాయి. గతేడాది దేశంలో 797 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. దీని విలువ 3.4లక్షల కొట్ల రూపాయలు. కాని గోల్డ్‌ రేట్‌ మాత్రం స్తబ్దుగానే ఉండిపోయింది. పెరగలేదు.. తగ్గలేదు. అమెరికా డాలర్ల లెక్కన చూస్తే.. గతేడాది పదిగ్రాముల గోల్డు 1750 డాలర్ల దగ్గర స్థిరంగా ఉంది. ఇప్పుడది 1900 డాలర్లకు పెరిగింది.

2021లో ఈ బంగారం కొనుగోళ్లకు కారణం దేశంలో ప్రజలు కోవిడ్‌ నుంచి కుదుటపడడమే కాదు.. రిజర్వ్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించేందుకు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా. ఇక సాధారణ జనం కూడా బంగారు ఆభరణాలను కొనేందుకు మొగ్గుచూపారు. కాని విశ్లేషకులు అనుకున్నంత కొనేగోళ్లు సాగలేదు. అందుకే ధర కూడా స్తబ్దుగా ఉండిపోయింది.

కోవిడ్‌ కాలంలో బంగారం ధర..

కోవిడ్‌ కాలంలో బంగారం ధర ఎటూ కదల్లేదు. కొనుగోళ్లు జరుగుతున్నా ధర మాత్రం స్థిరంగా ఉండిపోయింది. కారణం స్టాక్ మార్కెట్స్‌. 2020లో మార్కెట్లు భారీ నష్టాలకు గురైన తర్వాత అంతే వేగంతో పెరిగింది షేర్‌ మార్కెట్‌. ఆ ఏడాది జులై – ఆగస్ట్‌ నుంచి మార్కెట్లు పైకి వెళ్లడమే కాని.. భారీగా పతనమైన దాఖలాలు లేవు. దీంతో ఇన్వెస్టర్లందరూ మార్కెట్లపైనే దృష్టిపెట్టారు.

ఎప్పుడైతే స్టాక్‌ మార్కెట్స్‌ కరెక్షన్‌కు గురవుతుందో.. సెన్సెక్స్‌, నిఫ్టీలో ఉన్న కంపెనీల స్టాక్‌ ప్రైస్‌ పతనమవుతుందో.. అప్పుడు ఇన్వెస్టర్లు గోల్డ్‌ వైపు మళ్లుతారు. ఆసమయంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లో అలాంటి పరిస్థితే కనిపిస్తుండడంతో బంగారం ధర క్రమంగా ఎగబాకుతోంది.

గతంలో రోజుకి ఒకరిద్దరు కస్టమర్లతోనే లాగించిన గోల్డ్‌ షాపులు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు కస్టమర్లు పెరుగుతుండడం షాపు ఓనర్లు కూడా హ్యాపీగా ఉన్నారు. గోల్డ్‌ రేట్లు పెరిగే సమయంలోనే ఇలాంటి వాతావరణం కనపడుతుందని వర్తకులు చెబుతున్నారు. బులియన్‌ మార్కెట్‌ మరింత పెరిగితే.. కస్టమర్లు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలుంటాయంటున్నారు.

వరల్డ్‌ మార్కెట్లో బంగారం ధర..

ఈ నేపథ్యంలో గోల్డ్‌ ఎంతగా ఎగబాకుతుందో.. దిక్కుతోచని స్థితి. వరల్డ్‌ మార్కెట్లో బంగారం ధర అమెరికా డాలర్ల లెక్కన చూస్తే ఔన్సు బంగారం ధర 1900 డాలర్లు అంటే.. మనదగ్గర 10 గ్రాముల ధర 51వేలుగా ఉంది. ఇప్పటికిపుడు ఉక్రెయిన్‌ రష్యా వార్‌ మొదలైతే.. ఆ బంగారం ధర 2100 డాలర్లు అంటే.. 54వేలకు చేరుతుంది. అక్కడి నుంచి పైకి ఎగబాకడమే తప్ప.. కిందకి చూసే పరిస్థితి ఉండదు. యుద్ధం గనుక మొదలైతే.. గోల్డ్‌ వచ్చే మూడు నెలల్లో 57 వేల వరకు చేరుతుంది. అంటే మినిమమ్‌ 20శాతం పెరిగే అవకాశాలున్నాయి.

గతంలో గోల్డ్‌ ఆభరణాలనే కొనేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. కాని గత కొంత కాలంలో దీన్ని అపురూపమైన ఆస్తిగా చూస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ తర్వాత గోల్డ్‌ని ఏదో ఒక రూపంలో కొనేందుకు ఇంట్రెస్ట్‌ పెడుతున్నారు. గోల్డ్‌ బాండ్స్‌ కూడా ఇప్పుడు మంచి ట్రెండ్‌. దేశంలో అక్షరాస్యత పెరగడం వల్ల స్టాక్‌ మార్కెట్లు, బులియన్‌ మార్కెట్లు, గోల్డు బాండ్లపై అవగాహన పెరిగింది .దీంతో గోల్డు బాండ్లు, స్కీములపైనా జనాలు పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ఈ బంగారమే కాపాడుతుందన్న ధీమా. బంగారం ధర రోజు రోజుకు పెరగడం జనం గమనిస్తూనే ఉన్నారు.

గత పదేళ్లలో దేశంలో బంగారం ధరలు
(24 క్యారెట్లు, 10 గ్రాములకు)
సంవత్సరం అత్యధిక ధర

No. Year Gold Price
1 2010 18500
2 2011 26400
3 2012 31050
4 2013 29600
5 2014 28006
6 2015 26343
7 2016 28623
8 2017 29667
9 2018 31438
10 2019 35220
11 2020 58030
12 2021 52360

20 ఏళ్లలో దీని ధర 5000 రూపాయల నుంచి.. 50వేల రూపాయలు అంటే పదిరెట్లు పెరిగింది. అప్పుడు 50 వేల రూపాయలు పెట్టి వంద గ్రాముల బంగారం కొన్నవారు ఇప్పుడు 5లక్షల రిటర్న్స్‌ని (returns) చూస్తుంటారు. మరి ఇంత భారీ స్థాయిలో బంగారం పెరిగింది. ఇంకా పెరుగుతుందా? పడుతుందా? అన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు వచ్చే 20 ఏళ్లలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి?

బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది అంటే కచ్చితంగా ధర చెప్పకపోయినా.. భవిష్యత్‌లో మరింత భారీగా పెరగబోతున్నాయి గోల్డ్‌ రేట్లు. యుద్ధం, స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్లకు గురవడం.. ఇప్పటికే ఫెడ్‌ ఇంట్రస్ట్‌ రేట్లు పెరగడం వల్ల ప్రస్తుతం 1900 డాలర్లున్న రేటు.. 2400 వరకు పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంటే 57వేల రూపాయలు తాకుతుంది. కాబట్టి చేతిలో లిక్విడ్‌ క్యాష్‌ ఉంటే ఇప్పుడే ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు కూడా లేకపోలేదు. ఒకవేళ యుద్ధం రాకపోతే.. రేట్లు మాత్రం తగ్గకపోవచ్చు కాని పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవు.

బంగారం, వెండి ధరలను ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ నాలుగు నెలలుగా గోల్డ్‌కు డిమాండ్‌ బాగా పెరిగిందని, కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయని అంటున్నారు వ్యాపారులు.

ఇవి కూడా చదవండి: UP Elections 2022: మూడో రౌండ్ పోలింగ్‌పై యూపీ రాజకీయ పక్షాల్లో గుబులు.. బుందేల్‌ఖండ్‌లో కమలం మరోసారి వికసించేనా?

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు