
దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతుండటం, కరెంట్ అకౌంట్ లోటు విస్తరించడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. బంగారంపై వాస్తవ దిగుమతి సుంకం 6 నుంచి 15 శాతానికి చేరింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం, 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య, ప్రజలు బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో, బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద, భారతీయులు తమ ఇళ్లలో లేదా బ్యాంకు లాకర్లలో నిరుపయోగంగా ఉన్న బంగారు ఆభరణాలు, నాణేలు, బార్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. దీనిపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. గడువు పూర్తయ్యాక, వినియోగదారులు ప్రస్తుత బంగారం ధర ఆధారంగా నగదు తీసుకోవచ్చు లేదా సమాన విలువైన భౌతిక బంగారాన్ని పొందవచ్చు. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే ఈ పథకంలో కీలకమైన షరతు ఏమిటంటే, డిపాజిట్ చేసిన ఆభరణాలు అదే రూపంలో తిరిగి రావు. బ్యాంకులు వాటిని కరిగించి బంగారు కడ్డీలుగా మారుస్తాయి. ఆభరణాల్లో ఉన్న రాళ్లు, రత్నాలు వేరు చేసి తిరిగి ఇస్తారు. అలాగే, స్వచ్ఛత పరీక్షలో కల్తీ తేలితే బంగారం పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రక్రియలో ముందుగా KYC పూర్తి చేసి అధీకృత బ్యాంకులో జీరో-బ్యాలెన్స్ గోల్డ్ డిపాజిట్ ఖాతా తెరవాలి. తర్వాత బ్యాంకు సూచించిన కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ (CPTC)లో బంగారం జమ చేయాలి. అక్కడ 995 స్వచ్ఛత ప్రమాణం ఆధారంగా బంగారం విలువను నిర్ధారిస్తారు. సుమారు 30 రోజుల్లోగా బ్యాంకు డిపాజిట్ సర్టిఫికేట్ జారీ చేసి, బంగారం విలువను ఖాతాలో నమోదు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం 2025 మార్చి నుంచి మధ్యకాలిక, దీర్ఘకాలిక GMS పథకాలను నిలిపివేసింది. ప్రస్తుతం 1 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితితో ఉన్న స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ పథకం మాత్రమే అందుబాటులో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం డిపాజిట్ చేసే ముందు వడ్డీ చెల్లింపు విధానం, ముందస్తు ఉపసంహరణ సౌకర్యం, మెచ్యూరిటీ సమయంలో నగదు లేదా బంగారం రూపంలో చెల్లింపులపై స్పష్టత తీసుకోవడం చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి