దేశంలో మంట పుట్టిస్తున్న చమురు ధరలు.. ఇక్కడ మాత్రం లీటర్ పెట్రోలు ధర కేవలం రూపాయి..?
రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలికాలంలో రోజు రోజు పోటీ పడుతూ మరీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
one litre petrol for rs1 : దేశవ్యాప్తంగా చమురు ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలికాలంలో రోజు రోజు పోటీ పడుతూ మరీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటేనే ధరల మంట ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతో పెట్రో ధరలపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ‍్యస్వామి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా మరో వార్త ఆసక్తికరంగా మారింది.
ఒకపక్క పొరుగు దేశాలతో పోలిస్తే దేశీయంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరోపక్క దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45గా ఉండటం విశేషం. అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి.
భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకేఅందుబాటులోఉంది. ముఖ్యంగా భూటాన్‌లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం, పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు 51.14 రూపాయలు. భూటాన్‌లో పెట్రోల్ లీటరుకు రూ .49.56 వద్ద లభిస్తుంది. శ్రీలంకలో పెట్రోల్ ధర రూ .60.26. బంగ్లాదేశ్‌లో రూ. 76.41 రూపాయలు, నేపాల్‌లో 68.98 రూపాయలుగా ఉంది.
ఇక తక్కువ ధర పలుకుతున్న దేశాలను ఓసారి పరిశీలిస్తే.. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18గా ఉంది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 పలుకుతుంది. ఇక మనదేశంలో ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఇప్పటివరకు పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరగడం విశేషం.
ఇదీ చదవండి… అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక నిర్ణయం.. 17 ఏళ్ల ఆ ఇంటి బంధాన్ని తెంచుకోనున్న వైనం