Silver Rate: దడ పుట్టిస్తున్న వెండి.. ధరలతో బంగారమే బేజార్!

దడ పుట్టిస్తున్న వెండి ధర. వెండి మాతల్లి జిగేళ్ల ముందు పసిడి కూడా బేజారైపోతోంది. ఆల్రెడీ కొన్నవాళ్లకు ఖషీలు. కొనాలనుకునేవాళ్లకు మాత్రం ఫికర్లే. లక్షదాటి, 2 లక్షలు దాటి మరో పాతికవేలు దూసుకెళ్లి ర్యాపిడ్‌ మోడ్‌లో టాప్‌గేర్‌లో నడుస్తోంది వెండి. ఇవాళ్టికివ్వాళ కిలో వెండి ధర ఎంతో తెలుసా? అక్షరాలా 2 లక్షల 24 వేలు.

Silver Rate: దడ పుట్టిస్తున్న వెండి.. ధరలతో బంగారమే బేజార్!
Silver

Updated on: Dec 18, 2025 | 6:40 PM

ఇవాళారేపూ గోల్డ్‌రేట్లు కొండెక్కి, పట్టుకోండి చూద్దాం అని ఊరిస్తున్నాయి. మిడిల్‌క్లాసోడి నెక్ట్స్ ఛాన్స్‌ ఏంటంటే, ఇంకేంటి వెండి ఒక్కటేగా? ఏదైనా పండక్కో, శుభకార్యానికో, సెలబ్రేషన్‌కో కొనుక్కోవాలంటే వెండివైపే ఆశగా చూస్తున్నాడు సగటు కస్టమర్. కానీ.. ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకనంటోంది. వెండి ధరల ట్రెండ్ ఎలా ఉందో ఒక్కసారి పాతికేళ్ల ఫ్లాష్‌బ్యాక్‌లోకెళ్లి రేట్లు తెలుసుకుందాం పదండి…

2000వ సంవత్సరంలో వెండి కిలో ధర రూ. 7,900. 2004లో పదివేల మార్క్‌ క్రాస్ చేసి 11,770కి చేరింది. 2010లో 27,255 రూపాయలైంది. ఏడాదిలోనే రెండింతలు పెరిగి 2011లో 56,900కి చేరింది. మళ్లీ కిందిచూపులు చూసి తగ్గుతూ మళ్లీ పెరుగుతూ.. 2024 నాటికి లక్ష మార్క్‌ను టచ్ చేసింది వెండి కిలో ధర. కట్‌చేస్తే, 2025లో వెండి ధర ఆకాశమే హద్దు అంటోంది. ఏడాదిలో రెండింతలు పెరిగి 2 లక్షల రూపాయల మార్కును దాటేసింది. జూన్‌లో లక్షా 14 వేలున్న కిలో వెండి ధర, జూలైలో అక్షరాలా లక్షా పాతికను టచ్ చేసింది.

ఒక్క డిసెంబర్‌ నెల్లోనే దాదాపు 30 వేలు పెరిగి పట్టపగ్గాల్లేకుండా పరుగు పెడుతోంది వెండి. మంగళవారం 4000 తగ్గినట్టే తగ్గి, ఆ వెంటనే ఒరిజినల్ స్పీడ్‌కొచ్చేసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 11 వేలు పెరిగి, ఆల్ టైమ్ హైకి చేరుకుంది. గురువారం తర్వాత బులియన్ లెక్క తేలేసరికి, మళ్లీ రెండు వేలు పెరిగి.. లక్షా 24 వేల దగ్గర ఆగింది వెండి కిలో ధర.

వెండి మాయాబజార్ సంగతేంటో అర్థం కాక బులియన్ స్పెషలిస్టులే బుర్ర గోక్కుంటున్న పరిస్థితి. మొదట్లో వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎగబడ్డారు. సిల్వర్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడ్‌లో డిజిటల్‌ పెట్టుబడులు కూడా వెల్లువెత్తాయి. వెండిని పెట్టుబడి మార్గంగా భావించని కొందరైతే ప్లాన్‌బీ వైపు చూస్తున్నారు. లాంగ్‌రన్‌లో లాభాలొస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో.. వెండి వైపు చూడ్డం లేదు. అటు.. డొమెస్టిక్ యూజర్లు ఇంట్లో ఉండే పాత వెండిని బైటికి తీస్తున్నారు. వెండి చెంబులు, గిన్నెలు, కంచాలు, పూజా సామాగ్రి.. దేన్నీ ఉపేక్షించడం లేదు. 80 శాతం ధర వచ్చినా చాలంటూ తెగనమ్ముకోడానికి సిద్ధమౌతున్నారు కన్‌జ్యూమర్లు.

అటు, కొత్త వెండి వస్తువులు కొనాలనుకునే వాళ్లను ఒక ఫ్లాష్‌బ్యాక్ భయపెడుతోంది. 2011 తర్వాత ఒక్క ఏడాదిలోనే డబుల్ ధమాకా కొట్టి రెండింతలైన వెండి.. ఆ తర్వాత ఢమాల్న పడిపోయింది. తేరుకోడానికి పదేళ్లు పట్టింది. 2025 కూడా అటువంటి సర్‌ప్రైజ్‌నే ఇవ్వబోతోందా? లక్ష దాటి రెండులక్షలైన వెండి.. 2026లో దభేల్న లక్షకు పడిపోతుందా? ఏదైతేనేం.. వెండి ధర సగటు వినియోగదారుడితో దోబూచులాడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి