
సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రిజర్వేషన్లు, కన్ఫర్మ్ టికెట్లు, పెరిగిన ఛార్జీలు గుర్తొస్తాయి. కానీ మన దేశంలో ఒక రైలు మాత్రం వీటన్నింటికీ భిన్నం. ఈ రైలులో ఎక్కడానికి టికెట్ అవసరం లేదు. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. గత 75 ఏళ్లుగా ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా సేవలందిస్తోంది.
ఈ ఉచిత రైలు సేవ వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. 1948లో భారతదేశం నవనిర్మాణ దశలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాక్రా నంగల్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. ఆ సమయంలో ఆనకట్ట నిర్మాణానికి కావలసిన వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు, భారీ యంత్రాలను రవాణా చేయడానికి ఈ రైల్వే లైన్ నిర్మించారు.
సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇలాంటి తాత్కాలిక రవాణా ఏర్పాట్లు నిలిపివేస్తారు. కానీ 1963లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజల అవసరాలను, విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును ఉచితంగా కొనసాగించాలని నిర్ణయించింది. అప్పటి నుండి నేటి వరకు ఈ సేవ నిరంతరాయంగా సాగుతోంది.
పంజాబ్‌లోని నంగల్ నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా వరకు దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది భారతీయ రైల్వే పరిధిలోకి రాదు. దీనిని నేరుగా BBMB నిర్వహిస్తుంది. నేటికీ ఈ రైలులో పాతకాలపు చెక్కతో చేసిన కోచ్‌లు ఉండటం విశేషం. ఇది పర్యాటకులకు ఒక వింటేజ్ అనుభూతిని ఇస్తుంది. ఇంధనం, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులను పూర్తిగా BBMB భరిస్తుంది.
ఈ రైలు కేవలం పర్యాటకులకే కాదు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఆనకట్ట వద్ద పని చేసే ఉద్యోగులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోంది. రోజుకు రెండుసార్లు నడిచే ఈ రైలులో దాదాపు 300 మందికి పైగా ప్రయాణిస్తుంటారు.
భాక్రా ఆనకట్టను చూడటానికి వచ్చే పర్యాటకులకు ఈ రైలు ప్రయాణం ఒక ప్రత్యేక ఆకర్షణ. పర్వతాల మధ్య నుంచి, సట్లెజ్ నది పక్క నుంచి సాగే ఈ 13 కిలోమీటర్ల ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. కేవలం లాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఒక వ్యవస్థ ఏడు దశాబ్దాలుగా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఈ రైలు ఒక గొప్ప ఉదాహరణ.