Electric vehicles: ఈవీ రంగానికి పెట్టుబడుల వరద.. వచ్చే ఐదేళ్లలో 3.4 లక్షల కోట్లు వచ్చే అవకాశం

|

Dec 15, 2024 | 5:00 PM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసిన ద్విచక్ర, త్రిచక్ర, కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు బదులు ఈవీలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.3.4 లక్షల కోట్ల (40 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Electric vehicles: ఈవీ రంగానికి పెట్టుబడుల వరద.. వచ్చే ఐదేళ్లలో 3.4 లక్షల కోట్లు వచ్చే అవకాశం
Electric Vehicles
Follow us on

కొలియర్స్ ఇండియా అనే కన్సల్టింగ్ సేవల సంస్థ ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. దేశంలో ఈవీ పరిశ్రమ ప్రగతిని వివరించింది. ఆ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. దాని ప్రకారం వచ్చే ఆరేళ్ల అంటే 2030 నాటికి దేశంలోని ఈవీ, అనుబంధ పరిశ్రమలలో రూ.3.4 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఈ రంగంలో స్థిరమైన ప్రగతి కనిపిస్తోంది. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు నెమ్మదిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 8 శాతం రేటుతో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు పెరగడానికి మెరుగైన తయారీతో పాటు చార్జింగ్ సదుపాయాల కల్పించాలి. ధరలలో అంతరాలను తగ్గించాలి. దేశంలో 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాలలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ప్రకారం దాదాపు 8 కోట్ల ఈవీలు అమ్ముడుకావాలి.

ప్రస్తుతానికి ఈ వాటా కేవలం 8 శాతం మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ విక్రయించిన ఈవీలను 50 లక్షలు దాటలేదు. ఈ ఏడాది మాత్రం 20 లక్షలు అమ్ముడవుతాయని అంచనా. ఈ ప్రకారం ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రానున్న ఆరేళ్లలో ఏడాదికి సగటున ఆరు రెట్లు సేల్స్ పెరగాల్సి ఉంది. అయితే ఇది కొంచెం కష్టమైన విషయమే. ఈవీ రంగంలో రాబోయే ఐదు నుంచి ఆరేళ్లలో ప్రణాళికాబద్దమైన పెట్టుబడులు పెట్టనున్నారు. ఇవి రియల్ ఎస్టేట్ అవకాశాలను, పారిశ్రామిక, గిడ్డంగుల రంగానికి ప్రోత్సాహం అందించనుంది. భూసేకరణను వేగవంతం చేయడం, లిథియం- అయాన్ బ్యాటరీలతో సహా ఈవీ మరియు ఓఈ తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసే అవకాశం ఉంది. సబ్సిడీలు, పన్ను రాయితీలు, దేశీయంగా ఉత్పాదన, చార్జింగ్ మౌలిక సదుపాయాలు వంటి విషయాలను ఈవీల విక్రయాలకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వీటి ద్వారానే 2030 నాటి లక్ష్యాలన్ని చేరుకోగలిగే అవకాశం లభిస్తుంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. నిత్యం అనేక కంపెనీల వాహనాల విడుదలవుతున్నాయి. అతి పెద్ద జనాభా ఉన్న మన దేశంలో అనుకున్న స్థాయిలో వీటి విక్రయాలు జరగడం లేదు. ముఖ్యంగా చార్జింగ్ స్టేషన్లు సరిపడినన్ని లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. అలాగే మామూలు వాహనాలతో పోల్చితే వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడక్కడా ఈవీల నుంచి పొగలు, మంటలు రేగుతున్నట్టు వస్తున్న వార్తలు కూడా వీటి కొనుగోలు వేగంగా పెరగకపోవడానికి కారణమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి