PMVBRY: పీఎఫ్ అకౌంట్ ఉందా..? దరఖాస్తు చేసుకోకుండానే అకౌంట్లోకి రూ.15 వేలు..

మీరు కొత్తగా ఏదైనా కంపెనీలో తొలిసారి ఉద్యోగంలో చేరుతున్నాారా.. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల సాయం పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా ఉద్యోగాలు కల్పించేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు కూడా ఈ పథకంలో మార్పులు చేశారు.

PMVBRY: పీఎఫ్ అకౌంట్ ఉందా..? దరఖాస్తు చేసుకోకుండానే అకౌంట్లోకి రూ.15 వేలు..
Indian Money

Updated on: Jun 12, 2026 | 6:36 PM

మీరు మొదటిసారిగా ఉద్యోగంలో చేరారా..? అయితే మీకో గుడ్ న్యూస్. కంపెనీ మీకు ఇచ్చే జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల ఆర్ధిక సాయం పొందవచ్చు. అవును.. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు మొదటిసారి మాత్రమే ఈ సాయం అందిస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకం అందించేందుకు కేంద్రం నగదు అందిస్తోంది. ఉద్యోగికే కాదు ఉద్యోగం కల్పించినందుకు కంపెనీకి కూడా కేంద్రం డబ్బులు అందిస్తోంది. ఈ పథకం పేరే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ పథకం అర్హతలు ఏంటి..? ఎవరెవరికి ఆర్ధిక సాయం అందిస్తోంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

పీఎఫ్ ఖాతా కలిగి ఉండాలి

ప్రైవేట్ రంగంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరే ప్రెషర్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. ఈ పధకం ద్వారా రూ.15 వేల సాయం అందిస్తోంది. వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తోంది. అయితే దీనికి కొన్ని విధివిధానాలు రూపొందింది. ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈపీఎఫ్‌వో ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తొలిసారి పీఎఫ్ అకౌంట్ తెరవగానే పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. అయితే రూ.15 వేలు ఒకేసారి అందించరు. ఉద్యోగం చేరి ఆరు నెలల పాటు పనిచేసిన తర్వాత తొలి విడత అందిస్తారు. ఆ తర్వాత 12 నెలల తర్వాత రెండో విడత సొమ్ము జమ చేస్తారు.

ఉద్యోగం కల్పించినందుకు యజమానికి కూడా..

2025, ఆగస్ట్ 1 నుంచి జులై 31,2027 మధ్య కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలు కోసం కేంద్రం రూ.99,446 కోట్లు ఇప్పటికే కేటాయించింది. మొత్తం 1.92 కోట్ల మందికి ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా ఉద్యోగి లబ్ది పొందాలంటే జీతం రూ.లక్ష కంటే తక్కువగా ఉండాలి. ఇక ఉద్యోగం కల్పించినందుకు కంపెనీకి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఉద్యోగి జీతం ఆధారంగా వీటిని కంపెనీ అకౌంట్లో జమ చేస్తారు. కొత్త ఉద్యోెగాలు సృష్టించడం, యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 20.7 లక్షలకుపైగా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 2.35 లక్షలకు పైగా సంస్థలు PMVBRY పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మికశాఖ వెల్లడించింది.

Follow Us