IT Alert: మరో పది రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం(New Financial Year) ప్రారంభం కాగానే ప్రతిఒక్కరూ తమ నూతన ఆర్థిక ప్రణాళికలను(Financial Planning) తప్పక సిద్ధం చేసుకోవాలి. చేద్దాంలే అని చివరినిమిషం వరకు వేచి చూడటం వల్ల కొన్ని సార్లు అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. ముందుగా పన్ను ఆదాకోసం చేసుకునేందుకు చేసే పెట్టుబడుల విషయంలో హడావిడి పడి కొన్నిసార్లు నష్టాలను చూసే ప్రమాదం ఉంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పక చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టాక్స్ సేవింగ్స్ కోసం..
ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ మార్గాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం.. దానికి ఎంత పన్ను చెల్లించాలనే విషయాలను ముందుగా లెక్కించుకోవాలి. వాటిలో ఆదాయపన్ను చట్టం కింద లభించే సెక్షన్ 80C డిడక్షన్స్ వివరాలను పరిశీలించుకోవాలి. దీనికింద పన్ను రాయితీ పొందేందుకు పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఈఎల్ ఎస్ఎస్ వంటి వాటిలో పెట్టుబడులను సమీక్షించుకోవాలి. గరిష్ఠంగా అందే రూ. 1.50 లక్షల రాయితీని పొందటానికి ప్రణాళికాబద్దంగా పెట్టుబడులు పూర్తయ్యాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. వీటికి సంబంధించిన వివరాలను ఉద్యోగులు సదరు కంపెనీ హెచ్ ఆర్ లకు అందించి టాక్స్ మినహాయింపు పొందాలి.. లేకుంటే ఈ నెల జీతం నుంచి టాక్స్ కట్ చేయబడుతుంది. అవసరానుగుణంగా మార్చి 31లోపు తప్పనసరిగా పెట్టుబడులను పూర్తి చేయాలి.
IT రిటర్న్ దాఖలు..
2020-21 ఆర్థిక సంవత్సరం రిటర్నులు రుసుముతో సమర్పించేందుకు మార్చి 31 చివరి తేదీ. ఆ తర్వాత రిటర్నులను దాఖలు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ మీరు ఆడిట్ పరిధిలోకి వచ్చే టాక్స్ పేయర్ అయితే.. మీరు మార్చి 15 లోగా రిటర్నులను తప్పక దాఖలు చేయాల్సిందే.
ఆధార్-పాన్ అనుసంధానం..
ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు ఉంది. ఈ లోపే మీరు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలి. ఒకవేళ గడువులో లింక్ చేయకపోతే ప్రస్తుతం మీ వద్ద ఉన్న పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తరువాత లావాదేవీలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి.. ఎందుకంటే ఇప్పుడు అనేక ఆర్థిక వ్యవహారాల్లో పాన్ కార్డు తప్పని సరిగా మారింది కాబట్టి.
బ్యాంకులో కేవైసీ..
మీ బ్యాంకు ఖాతాలో మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను పూర్తి చేయండి. పాన్, ఆధార్, చిరునామా ధ్రువీకరణలాంటివాటితో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలనూ మార్చి 31 లోపు అందించాలి. దీనికి సంబంధించి పనులు పూర్తి చేసేందుకు మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. కొంతమంది మాయగాళ్లు క్యాంక్ ప్రతినిధుల మంటూ కాల్ చేసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి.
వివాదాలుంటే..
‘వివాద్ సే విశ్వాస్’ పథకంలో భాగంగా ఆదాయ పన్ను శాఖ ఏదైనా పన్ను బాకీ ఉంటే.. దానిని చెల్లించేందుకు మార్చి 31 వరకూ వ్యవధినిచ్చింది. ఇలా చెల్లించినప్పుడు వడ్డీతోపాటు, అపరాధ రుసుములనూ రద్దు చేస్తామని తెలిపింది.
ఇవీ చదవండి..
Market News: ఊగిసలాటలో సూచీలు.. స్వల్ప లాభాలతో ఆరంభం.. ఫోకస్ లో ఉన్న ఆ షేర్లు..
EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు.