EPFO: ఆ పధకం కోసం ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.?
ఫ్లాగ్‌షిప్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన పరిమితిని మార్చే అవకాశం ఉందని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది..
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ). ఫ్లాగ్‌షిప్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన పరిమితిని మార్చే అవకాశం ఉందని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. ఈ నిర్ణయం ఉద్యోగులు, కంపెనీల మధ్య సత్సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని భావిస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతరం అధిక మొత్తం డబ్బును పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది.
వేతన పరిమితి పెరుగుదలతో.. ఈపీఎఫ్ఓమరింత మంది ఉద్యోగులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం, EPFO ఉద్యోగుల భవిష్య నిధి(EPF) పథకానికి వేతన పరిమితి నెలకు రూ. 15 వేలుగా నిర్దేశించిన విషయం తెలిసిందే. దీన్ని 2014వ సంవత్సరంలో రూ. 6500గా ఉన్న దాన్ని సవరించింది. ఈ పథకం 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరోవైపు, వేతన పరిమితిని నిర్ణయించడానికి త్వరలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది ఈపీఎఫ్ఓ. ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద నెలకు రూ. 21,000 అధిక వేతన పరిమితితో.. EPFO వేతన పరిమితిని కూడా అనుసంధానించే అవకాశం లేకపోలేదు. మరోవైపు వేతన పరిమితి నిర్ణయం.. కేంద్రం అందిస్తోన్న రెండు సామాజిక భద్రతా పధకాల మధ్య సమానత్వాన్ని తెస్తుందని, సంస్థలపై సమ్మతి భారాన్ని తగ్గిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది.