EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్‌న్యూస్.. కేంద్రం నుంచి మరో శుభవార్త!
ఈపీఎఫ్ఓ ఖాతాదారుల కోసం ఇటీవల సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతీ నెలా లేదా మూడు నెలలు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ఇది ఎంచుకున్నవారికి మరో బెనిఫిట్ కల్పించేలా ఈపీఎఫ్ఓ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించే యోచనలో ఉంది. పీఎఫ్ విత్‌డ్రాయల్‌లో ఇటీవల కీలక మార్పులు చేశారు. ఉద్యోగుల కోసం కొత్త విత్ డ్రా ఆప్షన్ తీసుకొచ్చారు. అదే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(SWP). ఈ ప్లాన్‌లో భాగంగా ఒకేసారి కాకుండా తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను విడతల వారీగా చందాదారులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఎస్‌డబ్ల్యూపీ విధానంలో ఉపసంహరించుకునేవారికి భారీ ఊరట కలిగించేందుకు ఈపీఎఫ్ఓ సిద్దమవుతోంది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టం, 2025కు సవరణలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.
పన్ను మినహాయింపు కోసం ప్రతిపాదనలు..
ప్రస్తుతం ఒకేసారి పీఎఫ్ విత్ డ్రా చేసుకునేవారికి, ఉద్యోగంలో ఉన్నప్పుడే పాక్షికంగా విత్ డ్రా చేసుకునేవారికి ఆదాయపు పన్ను మినహాయింపులు కల్పిస్తున్నారు. అదే విధానాన్ని సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు కూడా వర్తింపచేయనున్నారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ నగదుపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ తొలగించాలని కోరుతోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ఆమోదించారు. ఈ క్రమంలో ఇలాంటి విత్ డ్రాలకు కూడా పన్ను మినహాయింపులు కల్పించేలా విధంగా ఈపీఎఫ్ఓ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. అయితే ఇది ఆమోదం పొంది నోటిఫికేషన్ జారీ అయ్యేంతవరకు పన్ను కొనసాగుతూనే ఉంటుంది
సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది..?
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో మూడు ఆప్షన్లు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు విడతల వారీగా తమ నగదును ఉపసంహరించుకునేందుకు మూడు ఆప్షన్లు కల్పించారు. ప్రతీనెలా స్థిరమైన మొత్తం పొందేలా చేసుకోవచ్చు. అలాగే ప్రతీ మూడు నెలలకు, ప్రతీ ఆరు నెలలకు చెల్లింపులు అందేలా సెట్ చేసుకునే సౌకర్యం ఉంది. విత్ డ్రా చేసుకోగా.. మిగిలిన బ్యాలెన్స్‌పై వడ్డీ లభిస్తూనే ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కలిగే అతి పెద్ద ప్రయోజనం ఇదేనని చెప్పవచ్చు. అయితే ఉద్యోగులకు కావాల్సినప్పుడు ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుని ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. అలాగే చందాదారుడు మరణించిన సందర్భంలో నామినీ లేదా వారిపై ఆధారపడివారు మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి లేదా వాయిదాలను స్వీకరించవచ్చు. కాగా 55 ఏళ్లు పైబడిన సుమారు 6.32 లక్షల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతిపాదిత సౌకర్యం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
