EPFO: కంపెనీ ప్రతీ నెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా? లేదా?.. ఈ మార్గంలో నిమిషాల్లో తెలుసుకోవచ్చు..
మీ జీతంలో ప్రతీ నెలా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం మీ కంపెనీ కొంతమొత్తం జమ చేస్తూ ఉంటుంది. అయితే ఇది అకౌంట్లో జమ అవుతుందా.. లేదా అనేది చాలామంది చెక్ చేసుకోరు. దీని వల్ల భవిష్యత్తులో మీకు సమస్యలు ఎదురురావొచ్చు. అందుకే ప్రతీ నెలా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ప్రతీ నెలా మీ పీఎఫ్ ఖాతాలో యాజమాన్యం డబ్బులు జమ చేస్తుందా..? లేదా? అని డౌట్ పడుతున్నారా? ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఆన్లైన్ ద్వారా సులువుగా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ అనేక మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్గాల ద్వారా మీరు సులభంగా ప్రతీ నెలా మీ కంపెనీ చందా జమ చేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. దేశంలో ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ప్రతీఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ అనేది ఉంది. ఇటీవల కేంద్రం పీఎఫ్ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచింది. దీంతో రూ.25వేలలోపు శాలరీ పొందేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరి. ఆపైన జీతం పొందేవారు యాజమాన్యంతో ఒప్పందం ప్రకారం స్వచ్చంధంగా చేరవచ్చు. పీఎఫ్ పరిధిలో చేరితే మీ జీతంలో 12 శాతం కట్ చేసి ఈ ప్రత్యేక ఖాతాలో యాజమాన్యం జమ చేస్తూ ఉంటుంది. ఇక యాజమాన్యం కూడా 12 శాతం చందా జమ చేస్తుంది. మీ జీతంలో కట్ చేస్తున్న డబ్బులను యాజమాన్యం పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుందా.. లేదా అనేది తనిఖీ చేసుకోవడం ముఖ్యం. పీఎఫ్ పాస్ బుక్ ఆప్షన్ ద్వారా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇదెలా అనేది తెలుసుకుందాం.
బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..?
–https://passbook.epfindia.gov.in/MemberPassBook/login పేజీ ఓపెన్ చేయాలి
-అనంతరం అక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా నమోదు చేయాలి
-ఆ తర్వాత సైన్ ఇన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది
-లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకోండి
-అక్కడ సెలక్ట్ మెంబర్ ఐడీ అనే ఆప్షన్ ఎంచుకోండి
-ఆ తర్వాత మీరు పనిచేస్తున్న సంస్థ పీఎఫ్ మెంబర్ ఐడీ సెలక్ట్ చేసుకోండి
-అనంతరం మీ పాస్ బుక్ తెరుచుకుంటుంది
-ప్రతీ నెలా మీ ఖాతాలో ఎంత జమ అవుతుందనేద అక్కడ స్క్రీన్‌పై కనిపిస్తుంది
-మీరు ప్రతీ నెలా చెక్ చేసుకోవడం ద్వారా కంపెనీ మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తుందా. లేదా అనేది తెలుస్తుంది.
జమ చేయకపోతే ఏం చేయాలి..?
కొన్నిసార్లు కంపెనీలు మీ ఖాతాలో పీఎఫ్ చందా జమ చేయడంలో ఆలస్యం చేయవచ్చు. ఇటవంటి పరిస్థితుల్లో మీ కంపెనీ హెచ్ఆర్ను సంప్రదించాలి. అక్కడ మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే పీఎఫ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరు ప్రతీ నెలా చెక్ చేసుకోకపోతే డబ్బులు జమ అవుతున్నాయా.. లేదా అనేది తెలియదు. దీని వల్ల భవిష్యత్తులో మీకు అవాంతరాలు ఎదురుకావొచ్చు.
