AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు రూ. లక్ష సంపాదించే సూపర్ ఛాన్స్..

ఏ పని చేయకుండానే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ 50,000 నుండి లక్ష రూపాయల వరకు అద్దె రావడం సాధ్యమేనా? మీ దగ్గర ఖాళీ స్థలం లేదా ఇంటి పైకప్పు ఉంటే ఖచ్చితంగా సాధ్యమే. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ విస్తరణ శరవేగంగా జరుగుతుండటంతో.. మొబైల్ టవర్ల డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. మీ ఖాళీ ఆస్తిని లీజుకు ఇచ్చి లైఫ్ సెటిల్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఇది.

మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు రూ. లక్ష సంపాదించే సూపర్ ఛాన్స్..
Earn Passive Income From Mobile Tower Lease
Krishna S
|

Updated on: Jun 05, 2026 | 1:11 PM

Share

ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చే రెగ్యులర్ ఆదాయంతో పాటు ఎలాంటి శ్రమ లేకుండా వచ్చే పాసివ్ ఇన్‌కమ్ అదే అదనపు ఆదాయం కోసం ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. మీకు నగరాలు లేదా పట్టణాల్లోని మంచి లొకేషన్‌లో ఖాళీ స్థలం లేదా ఇంటి టెర్రస్ ఉంటే.. అది మీకు ప్రతి నెలా కాసుల వర్షం కురిపించగలదు. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ కవరేజీని వేగంగా విస్తరించడానికి టెలికాం కంపెనీలు సరికొత్త మొబైల్ టవర్లను భారీగా ఏర్పాటు చేస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని చాలా మంది తమ ఖాళీ ఆస్తులను లీజుకు ఇస్తూ.. నెలకు రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు స్థిరమైన అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎంత ఆదాయం ఉందో, అంతే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. మొబైల్ టవర్ లీజుకు ఇచ్చే ముందు ఆస్తి యజమానులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, అధికారిక కంపెనీల సమాచారం ఇక్కడ చూద్దాం.

టవర్లు వేసే అసలు కంపెనీలు ఇవే

చాలా మంది జియో లేదా ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు నేరుగా వచ్చి టవర్లు వేస్తాయని భ్రమిస్తుంటారు. కానీ టెలికాం ఆపరేటర్లు ఈ పనులను నేరుగా చేయరు. దేశంలో టెలికాం మౌలిక సదుపాయాలను పర్యవేక్షించే ప్రత్యేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు మాత్రమే భూములను లీజుకు తీసుకుంటాయి. దేశంలో పెద్ద ఎత్తున టవర్లను మేనేజ్ చేసే ప్రధాన అధికారిక సంస్థలు ఇవే..

  • ఇండస్ టవర్స్
  • అమెరికన్ టవర్ కార్పొరేషన్
  • సమ్మిట్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  • టవర్ విజన్

ఈ కంపెనీలు మాత్రమే నెట్‌వర్క్ అవసరాలను బట్టి ఆస్తి యజమానులతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

టవర్ ఇన్‌స్టాలేషన్‌కు కావలసిన అర్హతలు.. స్థలం ఎంతండాలి?

మీ స్థలంలో టవర్ పెట్టాలంటే కేవలం ఖాళీ స్థలం ఉంటే సరిపోదు. సదరు కంపెనీల టెక్నికల్ టీమ్ వచ్చి అక్కడ క్షుణ్ణంగా సర్వే నిర్వహిస్తుంది. ఆ ఏరియాలోని జనాభా, సిగ్నల్ డిమాండ్, నెట్‌వర్క్ కవరేజ్ అవసరాలను పరిశీలించి.. కొన్ని అర్హతలు ఉంటేనే అనుమతి ఇస్తారు.

టెర్రస్: కనీసం 500 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. అలాగే భారీ టవర్ బరువును తట్టుకునేంత పటిష్టత ఆ భవనానికి ఉండాలి.

ఖాళీ ప్లాట్ లేదా భూమి: సుమారు 2,000 చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండాలి.

అవసరమైన ముఖ్యమైన పత్రాలు

లీజు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి..

  • భూమి లేదా భవనానికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు, తాజా ఆస్తి పన్ను రసీదులు.
  • భవన నిర్మాణ భద్రతా ధృవీకరణ పత్రం.
  • యజమాని పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు.
  • ఒకవేళ ఆస్తి అపార్ట్‌మెంట్‌లో ఉంటే అక్కడి వెల్ఫేర్ అసోసియేషన్ నుండి లేదా స్థానిక మున్సిపాలిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సమర్పించాలి.

ప్రాంతాన్ని బట్టి ఆదాయం.. లీజు నిబంధనలు

మొబైల్ టవర్ల ద్వారా వచ్చే అద్దె ఆదాయం పూర్తిగా ఆ ప్రాంతం డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

మెట్రో నగరాలు: బిజీ ఏరియాల్లో నెలకు రూ. 50,000 నుండి రూ.1,00,000 వరకు అత్యధిక అద్దె లభిస్తుంది.

చిన్న పట్టణాలు : నెలకు రూ.20,000 నుండి రూ. 40,000 వరకు సంపాదించవచ్చు.

గ్రామీణ ప్రాంతాలు: పల్లెటూళ్లలో నెలకు రూ.10,000 నుండి రూ. 20,000 వరకు అద్దె చెల్లిస్తారు.

ఈ లీజు ఒప్పందాలు సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాల దీర్ఘకాలిక వ్యవధితో కుదురుతాయి. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి అద్దెను పెంచే నిబంధన కూడా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా టవర్‌కు అయ్యే విద్యుత్ బిల్లు, మెయింటెనెన్స్ ఖర్చులను పూర్తిగా సదరు కంపెనీయే భరిస్తుంది.

అడ్వాన్స్ మోసాల పట్ల జాగ్రత్త..

మొబైల్ టవర్ల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ కేటుగాళ్లు, నకిలీ ఏజెంట్లు విపరీతంగా పెరిగిపోయారు. తాము ఫలానా టెలికాం కంపెనీ ప్రతినిధులమంటూ నకిలీ ఐడీ కార్డులు, అప్రూవల్ లెటర్లతో ఫోన్లు చేసి, నెలకు లక్షల్లో అద్దె ఇస్తామంటూ ఆశ చూపిస్తారు. టవర్ అప్రూవల్ ఫీజు, నోటిఫికేషన్ ఛార్జీలు, జీఎస్టీ పన్నులు లేదా సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ముందస్తుగా మీ అకౌంట్ నుండి డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తారు. గుర్తుంచుకోండి.. ఏ అధికారిక టెలికాం ఇన్‌ఫ్రా కంపెనీ కూడా టవర్ ఏర్పాటు చేయడానికి ఆస్తి యజమాని నుండి ఒక్క రూపాయి కూడా ముందస్తుగా డిమాండ్ చేయదు. కాబట్టి ఇటువంటి ఫేక్ కాల్స్ నమ్మి డబ్బులు పంపి మోసపోకండి.

Follow Us