E20 Petrol: ఈ20 పెట్రోల్ వాడితే వెహికల్ మైలేజ్ తగ్గుతుందా..? కేంద్రం క్లారిటీ.. అసలు విషయమిదే..
ఈ20 పెట్రోల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. వెహికల్ ఇన్యూరెన్స్ వర్తించనదని, మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం నడుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో పలు తప్పుడు వీడియోలు చలామణిలో ఉన్నాయి. వీటిని కేంద్రం ఖండించింది.

ఇథనాల్ ఈ20 పెట్రోల్ గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో దీని గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది వాడటం వల్ల ఇంజిన్ దెబ్బతింటుందని, మైలేజ్ భారీగా తగ్గిపోతుందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఈ ఇంధనం వాడితే వెహికల్ ఇన్యూరెన్స్ పని చేయదనే ప్రచారం కూడా వ్యప్తి చెందుతోంది. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాంటి తప్పుడు ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనదని, అనేక పరీక్షల తర్వాత శాస్త్రీయంగా ధృవీకరించబడిందని స్పష్టం చేసింది. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు వ్యాప్తి చేస్తూ పాత చిత్రాలు, వీడియోలను తిరిగి ప్రచారం చేస్తున్నారని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
ఇంజిన్ వైఫల్యాలు ఉండవ్..
2023లో E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వాహనాలకు సంబంధించి ఇంజిన్ వైఫల్యాలు, వాహనాలు ఆగిపోవడం లాంటి సంఘటనలు ఏమీ రిపోర్ట్ కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.2003లో ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం ప్రారంభించగా.. అప్పటి నుండి ఈ కార్యక్రమం దశలవారీగా విస్తరించిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని ప్రవేశపెట్టడంతో ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని తెలిపింది. ఆటోమొబైల్ కంపెనీలు సాంకేతిక అంచనాలు, సంప్రదింపుల తర్వాతనే ఈ20 పెట్రోల్ ప్రవేశపెట్టినట్లు నొక్కి చెప్పింది. చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్‌లో కలుపుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను ప్రభుత్వం తిరస్కరించింది. దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదంది. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపడానికి ముందు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారని, కిణ్వ ప్రక్రియ, స్వేదనం వంటి ప్రక్రియల ద్వారా ఇంధన ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. ఇంధన మిశ్రమానికి ఉపయోగించే ఇథనాల్ అనేక ప్రక్రియలకు గురవుతుంది, అసలైన వ్యవసాయ ముడి పదార్థానికి దీనికి ఎలాంటి పోలిక ఉండదని తెలిపింది.
మైలేజ్ విషయంపై కేంద్రం స్పష్టత
భారతదేశంలో ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసిస్, నూకలు, మొక్కజొన్న వంటి వివిధ వనరుల నుండి ఉత్పత్తి చేస్తారు. కిణ్వ ప్రక్రియ, స్వేదనం ద్వారా ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్‌లోని అవశేష చక్కెరలను పూర్తిగా తొలగిస్తారు కాబట్టి అందులో అలాంటివి ఏమీ ఉండవని స్పష్టం చేసింది. ఇథనాల్‌లో సాధారణంగా కీటకాలను దూరంగా ఉంచే డీనాచురెంట్లు ఉంటాయని పేర్కొంది. E20 ఇంధనానికి, చీమల ఆకర్షణకు, వాహనాల ఇంధన మూతల చుట్టూ కీటకాలు గుమిగూడటానికి సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. E20 పెట్రోల్ వాడితే వెహికల్ ఇన్యూరెన్స్ వర్తించదనే వార్తలు కూడా అవాస్తమవి పేర్కొంది. వాహనంలో వాడే ఇంధనం, ఇన్యూరెన్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా వాహనాలు తమ మైలేజీలో సుమారు 20 నుంచి 30 శాతం కోల్పోతాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి ఆధారం లేదని కేంద్రం తెలిపింది.
