ఇద్దరు సంపాదిస్తున్నా డబ్బులు కరువు ఎందుకుంటుంది? కారణాలు ఇవే కావొచ్చు!

రెండు ఆదాయాలున్నా చాలా కుటుంబాలు పొదుపు చేయడంలో విఫలమవుతున్నాయి. అధిక జీవనశైలి ఖర్చులే దీనికి ప్రధాన కారణం. జీతాలు పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెంచేయడం జీవనశైలి ద్రవ్యోల్బణంకు దారితీస్తుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచి, పొదుపు, పెట్టుబడుల ను నిర్లక్ష్యం చేస్తుంది.

ఇద్దరు సంపాదిస్తున్నా డబ్బులు కరువు ఎందుకుంటుంది? కారణాలు ఇవే కావొచ్చు!
Lifestyle Inflation

Updated on: May 19, 2026 | 6:06 AM

రెండు ఆదాయాలు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆర్థికంగా బలంగా ఉంటాయని భావిస్తారు. నెలవారీ ఆదాయం ఎక్కువగా ఉండటంతో మంచి జీవనశైలి, మెరుగైన ఇల్లు, సౌకర్యవంతమైన ప్రయాణాలు, పిల్లల విద్య, పెట్టుబడులు వంటి అంశాలను సులభంగా నిర్వహించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవంలో అధిక ఆదాయం ఉన్నప్పటికీ చాలామంది జంటలు సరైన పొదుపు చేయలేకపోతున్నారు. కారణం ఆదాయం తక్కువగా ఉండటం కాదు. జీవనశైలి ఖర్చులు నెమ్మదిగా పెరుగుతుండటమే ప్రధాన సమస్యగా మారుతోంది.

రెండు జీతాలు వస్తున్నాయనే భావనతో చాలామంది తమ ఖర్చులను కూడా అదే స్థాయిలో పెంచుకుంటారు. ఉదాహరణకు పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవడం, భారీ ఈఎంఐలతో గృహ రుణాలు తీసుకోవడం, ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, తరచుగా రెస్టారెంట్లలో భోజనం చేయడం, విదేశీ పర్యటనలు ప్లాన్ చేయడం, అనేక డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ సేవలకు చందాలు చెల్లించడం వంటి అలవాట్లు పెరుగుతాయి. ఒక్కో ఖర్చు చిన్నదిగా కనిపించినప్పటికీ, మొత్తం కలిపి చూస్తే నెలవారీ వ్యయం భారీగా పెరుగుతుంది.

ఇలా పెరిగే ఖర్చుల్లో ముఖ్యంగా స్థిర ఖర్చులు ప్రమాదకరంగా మారతాయి. అధిక అద్దె, గృహ రుణ ఈఎంఐలు, కారు లోన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, క్లబ్ సభ్యత్వాలు, బీమా ప్రీమియంలు వంటి ఖర్చులు ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ జీవనశైలికి అలవాటు పడితే, ఆదాయం ఉన్నప్పటికీ ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా ఒకరి ఉద్యోగం పోయినా లేదా ఆదాయం తగ్గినా కుటుంబ ఆర్థిక స్థితి కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు ఆదాయాలు ఉండటం వల్ల చాలా మందిలో డబ్బు సరిపోతూనే ఉంటుంది అనే భావన కూడా పెరుగుతుంది. దీంతో ప్రతి ఖర్చును గమనించే అలవాటు తగ్గిపోతుంది. ఫలితంగా పొదుపు, అత్యవసర నిధి, దీర్ఘకాలిక పెట్టుబడులు వంటి అంశాలు నిర్లక్ష్యం చేయబడతాయి.

దీనినే ఆర్థిక నిపుణులు లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. ఆదాయం పెరిగిన వేగం కంటే ఖర్చులు వేగంగా పెరగడం దీని లక్షణం. అయితే సరైన ప్రణాళికతో రెండు ఆదాయాలను పెద్ద ఆర్థిక బలంగా మార్చుకోవచ్చు. అదనపు ఆదాయంలో కొంత భాగాన్ని నేరుగా పొదుపు, మ్యూచువల్ ఫండ్లు, రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా అత్యవసర నిధుల కోసం కేటాయించడం మంచిది. జీవనశైలిని నియంత్రణలో ఉంచగలిగితే, రెండు ఆదాయాలు భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను వేగంగా అందించగలవు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us