Gold: ఒకరి వద్ద గరిష్ఠంగా ఎంత బంగారం ఉండాలో తెలుసా.. పరిమితికి మించి ఉంటే ఏమవుతుందంటే..

|

Mar 27, 2022 | 7:25 PM

ఒక వ్యక్తి వద్ద బంగారం(Gold) ఎంత ఉండాలనేది లిమిట్ ఉందా అంటే.. లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు...

Gold: ఒకరి వద్ద గరిష్ఠంగా ఎంత బంగారం ఉండాలో తెలుసా.. పరిమితికి మించి ఉంటే ఏమవుతుందంటే..
Follow us on

ఒక వ్యక్తి వద్ద బంగారం(Gold) ఎంత ఉండాలనేది లిమిట్ ఉందా అంటే.. లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. అందువల్ల ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలనేది ఎటువంటి లిమిట్స్ లేవు. అయితే ఒక సర్క్యులర్‌లో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) బంగారం నిల్వ పరిమితిని నిర్ణయించింది. ఈ రూల్స్ ప్రకారం మ్యారీడ్ ఉమెన్ 500 గ్రాముల బంగారు ఆభరణాలను కలిగి ఉండవచ్చు. అన్ మ్యారీడ్ ఉమెన్ విషయంలో ఈ పరిమితి 250 గ్రాములుగా ఉంది. పురుషుడు మ్యారీడ్ లేదా అన్ మ్యారీడ్ అయినా.. కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు 100 గ్రాముల వరకూ బంగారం కలిగి ఉండవచ్చని నిర్ణయించారు. ఆదాయపు పన్ను(Income Tax) శాఖ దాడులు నిర్వహిస్తే.. పైన చెప్పిన పరిమితుల వరకు బంగారు ఆభరణాలను జప్తు చేయదు. పైన చెప్పిన దాని కంటే ఎక్కువ ఉంటే మాత్రం జప్తు చేస్తుంది.

కుటుంబ ఆదాయం, సమాజంలో హోదాతో సంబంధం లేకుండా పన్ను అధికారులు నిర్ణీత పరిమితి వరకు బంగారు ఆభరణాలను జప్తు చేయరాదని CBDT సర్క్యులర్ స్పష్టం చేసిందని టాక్స్, ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు బల్వంత్ జైన్ తెలిపారు. ఈ ఆభరణాలకు సంబంధించి ఇన్కమ్ సోర్సును సదరు కుటుంబం వెల్లడించలేని స్థితిలో ఉన్నప్పటికీ.. వాటిని జప్తు చేయడం కుదరదని ఆయన వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపినప్పుడు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటే.. నిర్ణీత పరిమితిలో ఉన్న ఆభరణాలను పక్కన పెడతారు. మిగిలిన ఆభరణాలను మాత్రమే వారు స్వాధీనం చేసుకోగలరు. ఈ సర్క్యులర్ బంగారు ఆభరణాల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించడానికి ఉద్దేశించినది కాదు.

మీవద్ద నిర్దేశించిన పరిమితికి మించి ఆభరణాలను ఉంచుకుంటే.. ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ఫండ్స్ సోర్స్ వెల్లడించమని కోరవచ్చు. మీరు అప్పుడు దానికి సంబంధించిన అన్ని వివరాలను అందించగలిగితే.. సోదాల సమయంలో నగలు జప్తు చేయరు. మీరు పన్ను చెల్లించిన డబ్బుతో ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. దీని కోసం.. అన్ని కొనుగోలు రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవడం అవసరం. మీరు ఏదైనా పాత ఆభరణాలను ఎక్ఛేంజ్‌లో ఇచ్చి కొత్త వాటిని కొన్నా.. వాటికి సంబంధించిన రశీదులను, మేకింగ్ ఛార్జీల రశీదులను కూడా తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలి. బంగారు ఆభరణాలను చెక్కు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.

Read Also.. Ambulance Service: రెండు సెకన్లలో రెస్పాన్స్.. 15 నిమిషాల్లో అంబులెన్స్.. ఈ స్టార్టప్‌కు పెట్టుబడుల వెల్లువ..