ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఎలన్ మస్క్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన వ్యాపార దక్షతతో ఆదాయార్జనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారీ బిజినెస్ టైకూన్. సోమవారం ఒక్కరోజే తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా స్క్రిప్ట్ విలువ 14.9 శాతం పెరిగి 1,045.02 డాలర్లకు చేరింది. హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ లక్ష టెస్లా కార్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ సంస్థ షేర్లు పైపైకి దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లో ఎలన్ నికర సంపద సైతం 36.2 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే సోమవారం ఒక్కరోజే 2.71 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ఈ లెక్కన ఆయన గంటకు 11.3 వేల కోట్లు.. నిమిషానికి సుమారు 188 కోట్లు.. సెకనుకి 3 కోట్ల పేనే సంపాదిస్తున్నారన్న మాట.
తాజా లాభాలతో కలిసి మస్క్ సంపద విలువ మొత్తం 289 బిలియన్ డాలర్లకు చేరుకుంది ( ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.21.3 లక్షల కోట్లు). ఇది భారతదేశపు ఒక ఏడాది మొత్తం రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువ (19.7 లక్షల కోట్లు) కావడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 2021లో ఇప్పటి వరకు మస్క్ సంపద విలువ 119 బిలియన్ డాలర్లు ఎగబాకింది. ఇక తాజాగా టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పటివరకూ ట్రిలియన్ డాలర్లపైన మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు 5 మాత్రమే ఉన్నాయి. అవి.. యాపిల్, అమెజాన్, సౌదీ ఆరామ్‌కో, మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్. ఇప్పుడు టెస్లా కూడా వీటి సరసన చేరింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం (26-10-2021 వరకు)
ప్రపంచ టాప్ సంపన్నుల సంపద…
పేరు దేశం సంపద (బిలియన్ డాలర్లలో)
1. ఎలన్ మస్క్ అమెరికా 289
2. జెఫ్ బెజోస్ అమెరికా 193
3. అర్నాల్ట్ ఫ్రాన్స్ 163
4. బిల్ గేట్స్ అమెరికా 134
5. ల్యారీ పేజ్ అమెరికా 123
6. మార్క్ జుకర్ బర్గ్ అమెరికా 123
7. సెర్గే బ్రిన్ అమెరికా 119
8. ల్యారీ ఎలిసన్ అమెరికా 115
9. స్టీవ్ బాల్ మర్ అమెరికా 110
10. వారెన్ బఫెట్ అమెరికా 105
Also Read: