
మనందరికీ ఆధార్ కార్డు ఉంది. మన ప్రభుత్వం మనకిచ్చే గుర్తింపు ఆధార్. అది లేకపోతే మన దేశ పౌరులుగా గుర్తించరు. ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా ఈ ఆధార్ నంబర్ కావాల్సిందే. సామాన్య పౌరుడి నుంచి అతి పెద్ద ఇండస్ట్రీలిస్ట్ వరకూ ఆధార్ తప్పనిసరి. దీని గురించి ఇంకా విపులంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆధార్ కార్డు ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. అయితే ఆధార్ కార్డు మాదిరిగానే మరో కార్డు ఉద్యోగ్ ఆధార్ అని ఒకటి ఉంది. దీనికి గురించి బహుశా అందరికీ తెలిసుండకపోవచ్చు. ప్రస్తుతం దీనిని ఉద్యమ్ ఆధార్ అని పిలుస్తున్నారు. ఇది వ్యాపార వేత్తులకు ఇస్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకం కావాలన్నా మీరు ఈ నంబర్ ను కలిగి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ ఉద్యోగ్(ఉద్యమ్) ఆధార్ అంటే ఏమిటి? దానిని ఎలా పొందాలి? రిజిస్ట్రేషన్ ఎలా? ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2015లో ఈ ఉద్యోగ్ ఆధార్ ను ప్రారంభించింది. దీనికి ముందు కాగితం ఆధారంగా చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎంఎస్ఎంఈలు నెలకొల్పే ఔత్సాహికులకు ఈ ఉద్యోగ్ ఆధార్ కలిగి ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.
ఉద్యోగ్ ఆధార్ అంటే.. ఉద్యోగ్ ఆధార్ (ప్రస్తుతం ఉద్యమ్ ఆధార్‌గా రూపాంతరం చెందింది) అనేది ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య . ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తర్వాత వ్యాపార యజమానులకు ఉద్యోగ్ ఆధార్ సర్టిఫికెట్ కూడా అందిస్తారు. సరళంగా చెప్పాలంటే, ఇది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం సాధారణంగా అందించే ఆధార్ కార్డు వంటి గుర్తింపు వ్యవస్థ.
కేంద్ర ప్రభుత్వం, జూలై 2020లో, మునుపటి ఉద్యోగ్ ఆధార్ స్థానంలో ఎంఎస్ఎంఈల కోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం, కొత్త సంస్థలు కేవలం ఆధార్ నంబర్, స్వీయ-డిక్లరేషన్‌తో నమోదు చేసుకోవచ్చు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం పాన్ నంబర్ లేదా జీఎస్టీఐఎన్ ఆధారంగా ఎంటర్‌ప్రైజ్ వివరాలను ధ్రువీకరించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..